Telangana Politics: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ‘యువ సంగ్రామ సభ’ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారంటూ నిరుద్యోగుల పక్షాన నిలబడి రేవంత్ సర్కార్‌ను కడిగిపారేశారు.
70 వేల ఉద్యోగాల సవాల్..
“కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి, భర్తీ చేసినట్లు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా” అంటూ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. అంతేకాదు, ఆ విషయాన్ని రుజువు చేస్తే రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీకి కూడా జై కొడతానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను, ప్రక్రియలను తమ ఖాతాలో వేసుకుంటూ కాంగ్రెస్ డబ్బా కొట్టుకుంటోందని మండిపడ్డారు. దమ్ముంటే కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ల వివరాలతో రేవంత్ రెడ్డి ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
మొహబ్బత్ కా దుకాణ్ కాదు.. అది మోసాల దుకాణం
రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి నిరుద్యోగులతో చేసిన ‘చాయ్ పే చర్చ’ను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. “రాహుల్ గాంధీ.. మీది మొహబ్బత్ కా దుకాణ్ కాదు, మోసాల దుకాణం” అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు అశోక్ నగర్ వేదికగా నిరుద్యోగులకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని, జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. తెలంగాణ యువతను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఇప్పుడు వారిని నట్టేట ముంచిందని ఆరోపించారు.
యూత్ డిక్లరేషన్ కాదు.. కాంగ్రెస్‌కు డెత్ డిక్లరేషన్!
గత ఎన్నికల సమయంలో ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్’ కేవలం ఒక బూటకమని కేటీఆర్ తేల్చిచెప్పారు. నిరుద్యోగులకు నెలకు రూ. 4,000 భృతి, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్న వాగ్దానాలు ఏ తీరానికి చేరాయని ప్రశ్నించారు. యువతను మోసం చేసినందుకు గాను, అదే యువత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ‘డెత్ డిక్లరేషన్’ రాసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సరూర్‌నగర్ వేదిక సాక్షిగా యువతలో వస్తున్న తిరుగుబాటు కాంగ్రెస్ పతనానికి నాంది పలుకుతుందన్నారు.
ఓటుకు నోటు.. ఇప్పుడేమో వెన్నుపోటు!
సీఎం రేవంత్ రెడ్డి శైలిపై కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే ‘సాంప్రదాయిని, సుప్పిని, సుద్దపూస’ లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. “నాడు ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్, నేడు అధికారం ఇచ్చి గెలిపించిన ఓటరు దేవుళ్లకు వెన్నుపోటు పొడుస్తున్నారు” అని ధ్వజమెత్తారు. నిరుద్యోగులు ఎండ్రిన్ తాగి చచ్చినా సరే, అదనంగా 20 వేల ఉద్యోగాలు ఇవ్వననడం రేవంత్ రెడ్డి అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క
“రేవంత్ రెడ్డీ.. ఇప్పటిదాకా ఒక లెక్క, ఈ యువ సంగ్రామ సభ నుంచి మరో లెక్క” అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి ఉన్న అభ్యంతరం ఏంటని, “తెలంగాణ నీ అయ్యా జాగీరా.. నీ అయ్యా సొమ్మా?” అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల ఉసురు తగిలితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, యువత తరఫున బీఆర్ఎస్ పోరాటం ఇకపై మరింత ఉధృతం అవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?
'ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక్కడ నుంచి మరో లెక్క' డైలాగ్ చెప్పిన KTR#KTR #BRSParty #TelanganaPolitics #YuvaSangramaSadassu #Saroornaga #BreakingNews pic.twitter.com/vZtKXmtFcg
— BIG TV Breaking News (@bigtvtelugu) July 18, 2026