Skyroot Aerospace: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace)’ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1 (Vikram-1 Rocket Launch)’ శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. మధ్యాహ్నం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్ నుండి రెండు శాటిలైట్లతో సహా మొత్తం ఆరు పేలోడ్లను ఈ రాకెట్ దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విజయవంతం కావడం, అది కూడా తెలుగు వారిది కావడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను హైదరాబాద్ కు చెందిన తెలుగు కుర్రాళ్లు పవన్ కుమారు చందన, నాగ్ భరత్.. 2018లో స్థాపించారు. పవన్ ఐఐటీ ఖరగ్ పూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. కెరీర్ ప్రారంభంలో GSLV ప్రాజెక్టులో ఇస్రో శాస్త్రవేత్తగా ఆయన పనిచేశారు. చదువుకునే రోజుల్లో మ్యాథ్స్ లో పవన్ కాస్త వెనకబడి ఉండేవాడని.. సగం మార్కులే వచ్చేవని తెలుస్తోంది. అలాంటిది ఇప్పుడు స్పేస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించడం విశేషం. ఇక పవన్, భరత్ సారథ్యంలోని ఈ సంస్థ ప్రస్తుతం.. రూ.వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోంది. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. స్కైరూట్ ఎయిరోస్పేస్ టీమ్‌కు టెలిఫోన్ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇస్రో మిషన్ కంట్రోల్ సెంటర్ (MCC)లో ఉన్న స్కైరూట్ ప్రతినిధులు పవన్, భరత్ లతో ప్రధాని స్వయంగా మాట్లాడి.. వారిని ప్రశంసించారు.
భరత్ కు స్వయంగా ఫోన్ చేసి ప్రధాని మోదీ.. ‘మీ విజయం దేశంలోని ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తుంది. నేను లాంచ్ ప్రోగ్రాం మొత్తాన్ని వీక్షించాను. మీ స్కైరూట్ ఎయిరోస్పేస్ బృందాన్ని చూస్తుంటే అందరూ 25 నుండి 30 ఏళ్ల వయసున్న యువకుల్లా కనిపిస్తున్నారు’ అంటూ ప్రధాని కొనియాడారు. దీనికి పవన్ స్పందిస్తూ తమ బృందం సగటు వయసు 28 ఏళ్లు అంటూ మోదీకి తెలియజేశారు. ఈ ప్రయోగం భారత్ ‘ఆత్మనిర్భర్’ సాధించగలదని నిరూపించిందని మోదీ స్పష్టం చేశారు. ‘మీరిద్దరు (భరత్, పవన్) ఇలాగే ముందుకు వెళ్లాలని అనను. ఎందుకు కంటే మీరు ముందుకు కాదు, నిలువునా ఆకాశంలోకి దూసుకెళ్లాలి’ అంటూ ప్రధాని వారిని ఆకాశానికెత్తారు. ప్రధాని మోదీ నేరుగా ఫోన్ చేసి అభినందించే స్థాయికి తెలుగు కుర్రాళ్లు ఎదగడం పట్ల.. సర్వత్ర సంతోషం వ్యక్తమవుతోంది.
ప్రధాని మోదీ ‘వందేమాతరం’ అని రాసిన ఒక పోస్ట్‌కార్డ్‌ను సైతం విక్రమ్-1 ద్వారా అంతరిక్షంలోకి పంపారు. దీనిపై పవన్ కుమార్ స్పందిస్తూ ‘మీరు పంపిన కార్డ్ విజయవంతంగా కక్ష్యకు చేరుకుంది. వందేమాతరం ఇప్పుడు అంతరిక్షంలో ఉంది’ అని ప్రధానికి సంతోషంగా తెలియజేశారు. ప్రధాని మోదీ తమ గురించి ఇంత గొప్పగా మాట్లాడటం స్కైరూట్‌కే కాకుండా గ్లోబల్ స్పేస్ సెక్టార్‌కే ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ రాకెట్‌ను 100% భారతీయులే భారతదేశంలో తయారు చేశారని ఆయన గర్వంగా చెప్పారు.
Also Read: పోలీసులను వీడియో తీయెుచ్చా? ఫోన్ లాక్కునే హక్కు వారికి లేదా? చట్టం ఏం చెబుతోంది?
విక్రమ్ రాకెట్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇది 23 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల వెడల్పుతో అధునాతన కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో ఈ రాకెట్‌ను రూపొందించారు. ఇది మూడు దశల సాలిడ్ ఫ్యూయల్ లాంచ్ వెహికల్. నింగిలోకి సమర్థవంతంగా దూసుకెళ్లేందుకు ఇందులో లిక్విడ్ ఫ్యూయల్డ్ ఆర్బిట్ అడ్జస్ట్‌మెంట్ మాడ్యూల్ (OAM) అమర్చారు. ఇది లో-ఎర్త్ ఆర్బిట్‌కు 350 కిలోలు, సన్-సింక్రోనస్ ఆర్బిట్‌కు 260 కిలోల బరువును మోసుకెళ్లగలదు. ఇస్రో తన తొలి శాటిలైట్ లాంచ్ వెహికల్ (SLV-3) ని ప్రయోగించిన 46 ఏళ్ల తర్వాత శ్రీహరికోటలో ఒక ప్రైవేట్ సంస్థ ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం వాణిజ్య అంతరిక్ష రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
Also Read: సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!