KTR : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. సోమవారం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. సరూర్ నగర్ లో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఏర్పడిందని స్పష్టం చేశారు. స్వయరాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించారన్నారు. కానీ కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు నిరసన ర్యాలీలు చేపడుతున్నామన్నారు.
ప్రియాంక గాంధీ పర్యటన వేళ బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కాంగ్రెస్సే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యానికి ఆ పార్టీదే బాధ్యత అన్నారు. అందుకే ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కేటీఆర్ వివరించారు. బీఆర్ఎస్ తరహాలోనే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పనిచేస్తే నిరుద్యోగ సమస్యే ఉండేదికాదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గురించి చెబితే బాగుంటుందని ప్రశ్నించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో సంక్షోభానికి కేంద్రంగా తెలంగాణ ఉందన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ హయాంలో తాగునీటి కోసం కిలోమీటర్లకు కిలోమీటర్లు నడిచి గోస పడ్డ తెలంగాణ ఆడబిడ్డలు ఆ విషయాన్ని ఇంకా మరిచిపోలేదన్న సంగతిని ప్రియాంకగాంధీ గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. 2004 కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో పెట్టినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే వందల మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు జరిగేవి కాదన్నారు. తెలంగాణ ప్రజలు తమ చిరకాల స్వప్నమైన రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చేతిలోనే తమ భవిష్యత్తును భద్రపరుచుకున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.