Big Stories

Congress : నేడు కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ.. యూత్ డిక్లరేషన్ పై సర్వత్రా ఆసక్తి..

Congress : తెలంగాణలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. గతేడాది వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించబోతున్నారు.

- Advertisement -

తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌లో ప్రధానమైనది.. ఉద్యోగాల అంశం. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులు అన్యాయానికి గురవుతున్నారని కాంగ్రెస్ నేతలు ఎప్పటినుంచో విమర్శిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీ ఎటు పోయిందని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. ప్రభుత్వం భర్తీ చేస్తామన్న 90 వేల పోస్టుల సంగతేంటి? అని అడుగుతున్నారు.TSPSC పేపర్ లీక్‌తో నిరుద్యోగులను రోడ్డున పడేసారని హస్తం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ నిరసన దీక్షలతో ప్రభుత్వాన్ని ఎండగడుతున్న కాంగ్రెస్.. సరూర్‌నగర్‌లో జరిగే యువ సంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్‌ ప్రకటిస్తుంది.

- Advertisement -

వరంగల్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ కు మంచి స్పందన వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. భూమి లేని కౌలు రైతులకు ఏడాదికి 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులపై భారం లేకుండా పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. పంట నష్టం జరిగితే వెంటనే అంచనా వేసి పరిహారం ఇస్తామని రైతు డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు ఏటా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇస్తారని తెలుస్తోంది. ప్రతి నెలా నిరుద్యోగికి భృతికి కింద రూ. 3,500 నగదు ఇస్తామని ప్రకటిస్తారని సమాచారం. ప్రియాంక గాంధీ ఆవిష్కరించే డిక్లరేషన్ లో 9 అంశాలకు చోటు కల్పించినట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

సరూర్‌నగర్ సభను విజయవంతం చేసేందుకు టీకాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సభను సక్సెస్ చేయడానికి పీసీసీ చీఫ్ రేవంత్, ఇతర ముఖ్య నేతలు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులతోపాటు నిరుద్యోగ యువత భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ సభను సక్సెస్ చేసి.. అదే ఉత్సాహంతో ముందుకు సాగాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి సరూర్ నగర్ సభతో.. కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News