KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని పీర్జాదిగూడలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును ‘టీఆర్ఎస్’గా మార్చుకుంటానని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పార్టీ పేరు మార్పు కంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే ముఖ్యమని కేటీఆర్ పరోక్షంగా స్పష్టం చేశారు. “మనం అధికారం కోసం కొట్లాడటం లేదు, కష్టపడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడానికి పోరాడుతున్నాం.” అని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా, నూరు రోజుల్లో అమలు చేస్తామన్న ఏ ఒక్క హామీ నెరవేరలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. “అత్తకు 4000 పెన్షన్, కోడలకు 2500 రూపాయలు, తులం బంగారం, స్కూటీలు.. ఇవన్నీ ఎక్కడికి పోయాయి?” అని ఆయన ప్రశ్నించారు. మూడు నెలల్లో ఫలితాలు రావు అని సాకులు చెబుతున్న ముఖ్యమంత్రికి, 30 నెలలు గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో కళ్యాణలక్ష్మి, రైతు బంధు, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని, నేడు హైదరాబాద్‌లో బుల్డోజర్ల పాలన నడుస్తోందని మండిపడ్డారు.
నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రస్తుతం హైదరాబాద్‌లో దొంగలు, దోమలు మాత్రమే సంతోషంగా ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు భూములను దోచుకుంటుంటే, నగర ప్రజలు దోమల వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “దోమలగూడను మార్చి దోమల హిల్స్, దోమల బాద్ అని పేర్లు పెట్టినా ఆశ్చర్యం లేదు.” అని సీఎంపై సెటైర్లు వేశారు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, పేదల ఇళ్లను కూలగొట్టడం తప్ప ఈ ప్రభుత్వం ఒక్క కొత్త ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. అమీన్‌పూర్ నుండి పీర్జాదిగూడ వరకు బుల్డోజర్లతో సామాన్యుల గుడిసెలను కూల్చడమే రేవంత్ రెడ్డి మార్క్ అభివృద్ధి అని దుయ్యబట్టారు.
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణం ఎనిమిదేళ్లుగా సాగుతూనే ఉందని, అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. పార్లమెంట్ సీట్ల పెంపు (డీలిమిటేషన్) పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జనాభా నియంత్రణ పాటించిన మన రాష్ట్రాలకు సీట్లు తగ్గించి ఉత్తరాదికి మేలు చేయడం సరికాదని, దీనిపై కేసీఆర్ గారే ముందుండి ఉద్యమిస్తారని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తాము సమర్థిస్తామని, అయితే దాని వెనుక రాజకీయ డ్రామాలు ఉండకూడదని హితవు పలికారు.
రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. “కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ ఇంటికే బుల్డోజర్లు వస్తాయి.” అని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తాను చెప్పిన మాటలు నిజమవుతున్నాయని గుర్తు చేశారు. రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు రాబోతున్నారని, కార్యకర్తలు ధైర్యంగా ఉండి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. మల్లారెడ్డి నాయకత్వంలో మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, పార్టీలో చేరుతున్న పోచన్న, మధుకర్ వంటి నాయకులతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు