KTR: స్వేచ్ఛ, బ్యూరో: మంత్రుల కంటేఅధికారులే మాట్లాడుతున్నారని.. ప్రభుత్వంలో అధికారులు రింగ్ మాస్టర్లుగా తయారయ్యారని..మంత్రులను అధికారులు పిచ్చివారిని చేస్తున్నారని.. మూసీ రివర్ డెవలప్‌మెంట్ అధికారి.. కాంగ్రెస్ లీడర్‌లా మాట్లాడుతున్నారని.. ‘మూసీ ప్రాజెక్ట్‌ను ఆరు నూరైనా పూర్తి చేసి తీరుతామని అనడానికి ఎవరు నువ్వు? జస్ట్ ఆఫీసర్ మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అధికారులు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. మూసీలో లూటీ, హ్యామ్ లో అవినీతి అధికారులు రిటైర్ అయినా వారిని వదిలిపెట్టేది లేదని, చిక్కులు తప్పవన్నారు. ప్రభుత్వాన్ని తప్పుడు పనులకు అధికారులు ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. ‘కుక్క తోకను ఊపట్లేదు.. తోకే కుక్కను ఊపుతున్నట్లుంది అధికారులు, మంత్రుల తీరు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలోని ఎల్ఓపీ నేత కార్యాలయంలో బుధవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. 57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తున్నారని, అవి ఇచ్చినట్టు నిరూపిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అదే సమయంలో సీతక్క తనను రాజీనామా చేయమంటున్నారని, అసెంబ్లీలో అబద్ధాలు చెప్పినవారే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. భట్టి గానీ, సీతక్క గానీ ఎవరు రాజీనామా చేస్తారో తేల్చుకోవాలని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తను మాటకు కట్టుబడి ఉన్నానన్నారు.
మూసీకి ఏడీబీ రుణం ఇచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డీపీఆర్ కు 18 నెలలుపడుతుందని చెప్పి.. ఇప్పుడు ఇచ్చామని అంటున్నారని, వాస్తవానికి డీపీఆర్ ఇవ్వకపోవడంతోనే రుణం మంజూరుకాలేదన్నారు. డీపీఆర్ ఫేజ్-1 అయిందని చెబుతున్నారని, దానిని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. పైసా ఇచ్చినోడు లేడు, డీపీఆర్ లేదని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్ట్ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, ఆరు నూరైనా పూర్తి చేస్తాం అనే వ్యాఖ్యలు చేయడం వారి అధికార పరిధికి మించినదన్నారు. ప్రభుత్వ అక్రమాలకు తలొగ్గే అధికారులకు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సభను తప్పుదోవ పట్టించినందుకు మంత్రి శ్రీధర్ బాబుపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని వెల్లడించారు. మూసీ ప్రాజెక్ట్‌కు తాము వ్యతిరేకత లేదని, కానీ దాని పేరిట జరుగుతున్న లూటీకి మాత్రమే వ్యతిరేకమని వెల్లడిం చారు.
సీఎం చెబుతున్న మాటలను మంత్రి వ్యతిరేకిస్తున్నారన్నారు. మూసీ ప్రక్షాళనకు 1.5లక్షలకోట్లు అని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారని అని మండిపడ్డారు. మంత్రులు వితండవాదం చేస్తున్నారన్నారు. మూసీకి డీపీఆర్ లేకుండానే ఇళ్లు కూలుస్తున్నారని, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్ ప్రజలకు కూడా నోటీసులు ఇస్తూ, వేలాది కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. 3297 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి 10 వేల ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పుడు 1400 ఇళ్లు మాత్రమే అంటున్నారని, ఇది పూర్తిగా ప్రజలను మోసం చేసే ప్రక్రియ అని అన్నారు. మధు పార్క్ కోసం ప్రత్యేకంగా ఇళ్లు ఇస్తామని ఎందుకు చెప్తున్నారు? మిగతా వారికి ఎందుకు ఇవ్వరు? అని నిలదీశారు. పైసలు లేవు.. ప్రణాళికలు లేవన్నారు.
ఐటీ ఉద్యోగులకు 9లక్షల 46వేల మంది ఉండేవారని.. ఐటీ ఎగుమతులు పెరిగాయని చెబుతున్నప్పుడు 9లక్షల39లక్షలకు అంటే 7వేల మంది ఎలా తగ్గారని నిలదీశారు. దీంతో అనుబంధరంగాలు కుప్పకూలుతాయన్నారు. గవర్నర్ తో తప్పుడు మాటలు చెప్పించారన్నారు. భూ సేకరణను ఫార్మా సిటీ పేరిట చేసి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలకు, జూ..ఇతరులకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. 30వేల ఎకరాల్లో భారత్ ప్యూచర్ సిటీ అంటూ 30 అడుగుల భూమి కూడా సేకరించలేదని మండిపడ్డారు. కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టుల మధ్య ప్రజలను ఎలా నివసింపజేస్తారని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు, ఫార్మా సిటీకి శ్రీకారం చుట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎస్టీపీలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిన ఘనత కేసీఆర్ దేనన్నారు. మూసిని మాకు అప్పగిస్తే 16వేలకోట్లతో చేసిచూపుతామన్నారు. మెయిన్ హార్ట్ కంపెనీని భారత్ లోనే నిషేధించారని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా బ్యాన్ చేసిన సంస్థను ఎందుకు ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించారు. పాకిస్తాన్‌లో పనికిరాని కంపెనీ మనకు ఎలా పనికివస్తుందని నిలదీశారు. మొబైల్ అడ్వాన్స్ లను రద్దు చేస్తే ఈ ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ ఎజెండా భూములు అని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మూసీ ప్రాజెక్ట్‌కు లక్షన్నర కోట్లు ఎలా సమీకరిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
మూసీ ప్రాజెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని, “గాంధీ సరోవర్, రాహుల్ గాంధీ సరోవర్ పేర్లతో కొత్త నాటకాలు ఆడుతున్నారా?” అని ప్రశ్నించారు. అమీన్‌పూర్‌లో కూల్చివేసిన ఇళ్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం చట్టవ్యతిరేక చర్యలు చేపడుతోందని అన్నారు. మా పార్టీ బీ ఫాం మీద గెలిచిన వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఎంపీగా పోటీచేసిన వ్యక్తి సైతం క్లీన్ చిట్ ఇచ్చారు.. మమ్మల్ని తిడితే కూడా ఖండించలేదు. అలాంటప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారు? మాకే ప్రభుత్వం తట్టుకోవడం లేదు. కేసీఆర్‌ను ఎలా తట్టుకుంటారు? అన్నారు. మంత్రులు మా ప్రశ్నలకు బిత్తరపోతున్నారన్నారు. ప్రభుత్వ నిషేధిత జాబితాలో లక్ష ఎకరాలు ఎలా వచ్చిందని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రోజురోజుకు బయటపడుతోందని, త్వరలోనే టూరిజం మంత్రి స్కాం బయటపెడతామని స్పష్టం చేశారు.
Also Read: Azeem Rafiq: పాకిస్తాన్ ను అనే ముందు కావ్య పాపకు గడ్డి పెట్టండి..గవాస్కర్ కు కౌంటర్