జగిత్యాల పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న తరుణంలో గులాబీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తుంటే రాజకీయ ప్రత్యర్థులైన గుంటనక్కలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ జగిత్యాలలో సభ నిర్వహిస్తుంటే దానికి పోటీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డలో సభ పెట్టడం వారి ఆందోళనకు నిదర్శనమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తు గురించి తాను గతంలో తక్కువగా అంచనా వేశానని.. అయితే ఆయనది మెదడు కూడా చాలా చిన్న మెదడు అని కేటీఆర్ విమర్శించారు. జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే తీరును ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన హైబ్రిడ్ ఎమ్మెల్యేనో లేక క్రాస్ బ్రీడ్ ఎమ్మెల్యేనో అర్థం కావడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడే వారు గోడలు దూకడాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
జగిత్యాల గడ్డ నుండే బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర ప్రారంభమైందని కేటీఆర్ ప్రకటించారు. ఈ ప్రాంతం నుండి పార్టీకి పూర్వ వైభవం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని ఆటంకాలు సృష్టించినా కేసీఆర్ సభ విజయవంతం కాకుండా ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని వివరించారు.
షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ సాయంత్రం 5:30 గంటలకు జగిత్యాల సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సుమారు గంట సేపు సాగే ఈ బహిరంగ సభలో కేసీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పు రాబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు.