Bangladesh Devils Hunt | బంగ్లాదేశ్లో మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా మద్దతుదారులపై “ఆపరేషన్ డెవిల్స్ హంట్” పేరుతో దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 1,300 మందిని అరెస్టు చేసినట్టు సమాచారం. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ భవనాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడులు చేస్తున్నారు. ఈ దాడులను అరికట్టేందుకు, ప్రత్యర్థులను ఏరివేసేందుకు ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ ప్రణాళికలు రూపొందించింది.
బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం ప్రత్యర్థులను వేధించేందుకు కొత్త చర్యలు ప్రారంభించింది. దేశంలో ఆరు నెలల క్రితం ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం ప్రస్తుతం దేశంలో అస్థిరతను సృష్టించే వారిని ఏరివేస్తామని తెలిపింది. కానీ నిజానికి హింసకు పాల్పడే నిరసనకారులకు బదులు ప్రత్యర్థి పార్టీ నాయకులను నిర్వీర్యం చేయడానికి రాజకీయాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై “ఆపరేషన్ డెవిల్ హంట్” దాడులు ప్రారంభించింది.
ఢాకా శివారులోని గాజీపూర్లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్టు ఇంటీరియర్ మినిస్ట్రీ అధిపతి జహంగీర్ ఆలమ్ చౌద్రీ తెలిపారు.
ప్రజా భద్రత కోసం ఈ ఆపరేషన్ అమలు చేయబడుతోందని ప్రభుత్వం పేర్కొంది. “ఆపరేషన్ డెవిల్స్ హంట్”లో ఇప్పటికే 1,300 మందిని అరెస్టు చేసినట్టు తెలిసింది. మరిన్ని అరెస్టులు కూడా జరగవచ్చని అంచనా. ఈ సందర్భంగా జహంగీర్ ఆలమ్ మాట్లాడుతూ, “బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమం తర్వాత దాడులు పెరిగాయి. వారి ఏరివేతే మా లక్ష్యం. దుష్ట శక్తులను అంతం చేసే వరకు ఈ ఆపరేషన్ ఆగదు” అని తెలిపారు.
Also Read: సెలవు ఇవ్వలేదని ఆఫీసులో నలుగురిని కత్తితో పొడిచేశాడు.. వీడియో వైరల్
అయితే తాజాగా షేక్ హసీనా కుటుంబ భవనాలపై కొందరు దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్ స్మారక భవనంపై దాడి జరిగింది. ఈ దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిని, మ్యూజియం కూడా ధ్వంసమైంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఒక మంత్రిపై దాడికి ఈ ప్రత్యర్థి నాయకుల గ్యాంగ్ సభ్యులే కారణమని కొందరు మంత్రులు ఆరోపిస్తున్నారు.
బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన పెరిగిన పరిస్థితుల్లో, ఆగస్టు 5న దేశం వీడిన షేక్ హసీనా భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో హసీనాతోపాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు, సలహాదారులు మరియు సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కొత్త ఆపరేషన్ కూడా హసీనా, అవామీ లీగ్ మద్దతుదారులపైనే కేంద్రీకృతమై ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలను బంగ్లాదేశ్ హోంమంత్రి తోసిపుచ్చారు. “డెవిల్ అంటే దేశ వ్యతిరేక శక్తులు. దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారులు, చట్టాన్ని ఉల్లంఘించేవారు, తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొనేవారు. ఈ దేశ వ్యతిరేక శక్తులను ఏరివేయడమే ఈ ఆపరేషన్ లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు.