KTR : 8 గంటలు. కార్నర్ చేసేలా క్వశ్చన్స్. నిజాలు రాబట్టేలా పక్కాగా ఎంక్వైరీ. కేటీఆర్‌కు ఏసీబీ చుక్కలు చూపించినట్టే ఉంది. బయటకు వచ్చాక ఆయన ఫేస్ చాలా డల్‌గా మారిందంటున్నారు. లోనికి వెళ్లే ముందు ఉన్న కాన్పిడెన్స్ తగ్గిపోయిందని చెబుతున్నారు.
కేటీఆర్ సెల్‌ఫోన్స్ సీజ్?
ఫార్ములా-E కార్ రేస్ కేసులో ఏ1గా కేటీఆర్ ఉన్నారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీపై ఏసీబీ ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ చేసేందుకు ఏసీబీ ప్రయత్నించింది. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే అంచనా వేసిన ఆయన.. విచారణకు మొబైల్ ఫోన్ తీసుకురాలేదు. తన దగ్గర ఫోన్ లేదని చెప్పారు. అయినా, అధికారులు వదలలేదు. కేటీఆర్‌కు 2 రోజులు డెడ్‌లైన్ పెట్టారు. ఫార్ములా-ఈ రేసు జరిగిన సమయంలో వాడిన సెల్‌ఫోన్స్‌ను.. జూన్ 18లోపు అప్పగించాలని కేటీఆర్‌ను ఆదేశించారు అధికారులు. ఆ ఫోన్లు ఏసీబీ చేతికొస్తే.. ఇక అసలు గుట్టు బయటపడొచ్చు అంటున్నారు.
15 రోజులు జైలుకు వెళతా..
విచారణ తర్వాత తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి గాంభీర్యం ప్రదర్శించారు. ఉదయం నుంచీ తనను అడిగిన ప్రశ్నలే తిప్పి తిప్పి అడిగారని అన్నారు. అసలు ఈ కేసులో అవినీతి ఎక్కడ ఉందంటూ తానే తిరిగి ఏసీబీ అధికారులను ప్రశ్నించానని చెప్పారు. పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలనే తనను అడిగారన్నారు. తనను జైల్లో పెట్టి ఆనందం పొందాలని చూస్తు్న్నారని.. ఓ 15 రోజులు జైలుకు వెళతా.. జైల్లో రెస్ట్ తీసుకుంటా.. అంటూ సెటైరికల్‌గా మాట్లాడారు. వందల కేసులు పెట్టినా.. జైల్లో పెట్టినా భయపడేదేలే అన్నారు కేటీఆర్.
ఐఏఎస్ అరవింద్ ఎక్కడ?
కేటీఆర్‌కు కాంగ్రెస్ నేతలు అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక వ్యక్తి IAS అరవింద్‌కుమార్ ఎక్కడున్నారో చెప్పాలంటూ కేటీఆర్‌ని డిమాండ్ చేశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి. ఫార్ములా ఈ రేసు కేసులో అరవింద్ చాలా కీలకమైన వ్యక్తని… ఆయన ఇప్పుడు కనిపించట్లేదన్నారు. అరవింద్ లేరు కాబట్టే ఏమీ కాదన్న ధీమాతో కేటీఆర్ ఎన్ని సార్లైనా జైలుకు వెళ్లడానికి సిద్ధమంటున్నారని విమర్శించారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ ఏమైనా చేస్తారు. గతంలో కేటీఆర్ మిత్రుడు కేదార్ విదేశాల్లో చనిపోయారు. కేటీఆర్ ప్లాన్‌తోనే ప్రభాకర్‌రావు అమెరికాకు వెళ్లి దాక్కున్నారని అని ఎంపీ చామల ఆరోపించారు. చట్టం నుంచి కేటీఆర్ తప్పించుకోలేరన్నారు.