Lady Aghori: లేడీ అఘోరీ ఈసారి రూట్ మార్చారు. నిన్నటి వరకు పోలీసులపై శివాలెత్తిన అఘోరీ, తాజాగా ప్రజలపై గుర్రుమన్నారు. అంతేకాదు ఏకంగా పెట్రోల్ క్యాన్ పట్టుకొని, ఆత్మార్పణ చేసుకుంటానని హెచ్చరించి హల్చల్ చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని కొమ్మాల గ్రామ సమీపంలో జరిగింది.
ఇటీవల ఏదొక వివాదంలో ఉంటున్న లేడీ అఘోరీపై తాజాగా సిద్దిపేట జిల్లాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. కొమురవెల్లి ఆలయానికి వెళ్లిన అఘోరీ, అక్కడ సిబ్బందితో ఘర్షణ పడ్డారు. అంతేకాదు అక్కడ వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధి యొక్క మొబైల్ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టారు. ఒక్కసారిగా తన కారులో గల కత్తి చేతబట్టి, ఆలయం వెలుపల అఘోరీ హల్చల్ చేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందగా, నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
గురువారం వరంగల్ జిల్లా కొమ్మాల గ్రామ సమీపంలో లేడీ అఘోరీ ప్రత్యక్షమైంది. అఘోరీని చూసిన స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున గుమికూడారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు అఘోరీ ఎందుకు వెళ్లలేదని స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. నాగ సాధువులు, సత్పురుషులు, అఘోరాలు కుంభమేళాలో కోట్ల మంది భక్తులను ఆశీర్వదిస్తుంటే, తెలంగాణలో తిరుగుతూ అఘోరీ హల్చల్ చేయడంపై ప్రజలు ప్రశ్నించారు. ఇక అంతే సహనం కోల్పోయిన అఘోరీ ఆగ్రహంతో ఊగిపోయారు.
Also Read: TG Govt: తెలంగాణ పది విద్యార్థులకు గుడ్ న్యూస్..
తన కారులో గల పెట్రోల్ క్యాన్ చేతబట్టి, తాను ఆత్మహత్య చేసుకుంటానని స్థానికులను బెదిరించింది. తాము అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, ఆత్మార్పణ చేసుకుంటానని బెదిరించడంపై స్థానిక ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరకు అఘోరీకి నచ్చజెప్పి అక్కడి నుండి పంపించినట్లు తెలుస్తోంది. లేడీ అఘోరీని కాస్త కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు చర్చించుకోవడం విశేషం.