Lady Aghori: లేడీ అఘోరీ నోట భవిష్యవాణి వినిపిస్తుందట. మొన్నటి వరకు ఒక లెక్క.. నేటి నుండి మరో లెక్క అనే తీరులో అఘోరీ వ్యవహారం సాగుతోంది. స్మశానంలో ఉంటూ అఘోరీ మాత భవిష్యవాణి చెబుతుండగా.. భక్తుల క్యూ పెరుగుతోందట.
అఘోరీ మాత అంటే పెద్ద పరిచయం చేయాల్సిన పని కూడా లేదు. కారణం తెలుగు రాష్ట్రాలలో ఆమె అంత ఫేమస్. సాధారణంగా అఘోరా అంటేనే నిత్యం తపస్సు లో, వేరే ప్రపంచంలో ఉంటారన్నది మొదటి నుండి వస్తున్న వ్యవహారం. కానీ ఈ అఘోరీ మాత సమాజంలోకి రావడం, నగ్నంగా తిరగడం.. అది కాస్త అక్కడక్కడా వివాదం కావడం.. వార్తల్లో నిలవడం అందరికీ తెలిసిన విషయమే. అందుకే కాబోలు ఈ అఘోరీ మాత కాలు బయటకు పెట్టినా, మీడియా కూడా ఆమెపై ఫోకస్ చేస్తుందని చెప్పవచ్చు.
ఏపీలో పర్యటించిన అక్కడ హల్చల్ చేశారు. అది కూడా శ్రీకాళహస్తి ఆత్మార్పణ యత్నానికి పాల్పడిన సమయం నుండి అంతా వివాదమే అక్కడ. చివరకు మంగళగిరి లో రహదారిపై బైఠాయింపు అయితే అది వేరే లెవెల్ అని చెప్పవచ్చు. నగ్నంగా రహదారి పై బైఠాయిస్తే, పోలీసులు పదుల సంఖ్యలో వచ్చినా కట్టడి చేయలేని పరిస్థితి. సనాతన ధర్మ పరిరక్షణ తన ఆశయం అని చెబుతున్న అఘోరీ మాత, ఇలా ప్రతి రోజూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తున్నారు.
ఏపీ నుండి తెలంగాణ కు వచ్చిన అఘోరీ మాత, వరంగల్ లోని స్మశానంలో రాత్రి ప్రత్యక్షమయ్యారు. అక్కడ పూజలు నిర్వహించడం, అది కాస్త స్థానికులకు తెలియడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. స్మశానంలో పూజలు చేయడం అఘోరా లకు సర్వసాధారణమే. కానీ నిత్యం వార్తల్లో నిలుస్తున్న అఘోరీ మాత కనిపించడంతో, అక్కడికి ప్రజలు భారీగా చేరుకున్నారు. అలాగే పలువురు హిజ్రాలు కూడా అక్కడికి చేరుకొని ఆమెతో చర్చలు జరిపారు.
బుధవారం తెల్లారింది.. అంతే భక్తుల క్యూ మొదలైంది వరంగల్ స్మశానవాటికకు. ఒక్కొక్కరుగా మొదలై వందల సంఖ్యలో అఘోరీ మాత వద్దకు భక్తులు వస్తుండగా, స్మశానవాటిక కూడా సందడిగా మారింది. ఈ సంధర్భంగా తనను కలిసిన భక్తులకు అఘోరీ మాత భవిష్యవాణి చెబుతోందట. భక్తులు ఫలాలు తెస్తుండగా, వాటిని స్వీకరిస్తూ అఘోరీ ఆశీర్వాదాలు అందిస్తున్నారు. మొన్నటి వరకు వివాదాలతో వార్తల్లో నిలిచిన అఘోరీ.. ఇప్పుడు రూటు మార్చి భవిష్యవాణి చెప్పడం సంచలనంగా మారింది.