Lagacharla Case: లగచర్ల దాడి కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? టెక్నికల్ ఆధారాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారా? నిందితులు ఉపయోగించిన ఫోన్ నెంబర్లు ఆధారంగా ఓ అడుగు ముందుకేశారా? ఘటనకు ముందు అంటే వారం కిందట ఏం జరిగింది? నిందితులు ఎవరెవర్ని కలిశారు? అనేదానిపై ఆరా తీసే పనిలో పడ్డారు విచారణ అధికారులు.
లగచర్ల కేసు ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు అధికారులు. ఈ ఘటనలో టెక్నికల్ ఎవిడెన్స్ కీలకంగా మారినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులు ఓ అడుగు ముందుకేశారని చెప్పవచ్చు.
ఘటనకు వారం ముందు ప్రధాన నిందితులు సురేష్, పట్నం నరేందర్‌రెడ్డిలు కలిసి అక్టోబర్ 25న జూబ్లీహిల్స్‌లో నందినగర్ కేటీఆర్ ఇంటికి వచ్చినట్టు సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. నిందితుల సెల్ ఫోన్ టవర్ లొకేషన్ డేటాను సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సేకరించారు.
పట్నం నరేందర్‌రెడ్డి ఐఫోన్ ఓపెన్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. పాస్ వర్డ్ మర్చిపోయానని చెప్పడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించే పనిలో పడ్డారట. న్యాయస్థానం ఆదేశాలతో ఫోన్ ఓపెన్ చేసి డేటా రికవరీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ALSO READ: మాట మార్చిన కేటీఆర్.. చివరి వరకు ఆయనే? కొత్త రాగం వెనుక
ఇదిలావుండగా ఘటన జరిగిన రోజు ఆధారాలు ఎవరికీ దొరక్కుండా ఉండేలా సురేష్ తన ఫోన్ పగలగొట్టి చెత్తలో వేశానని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి సెల్ ఫోన్ లో ఏముందనేది కీలకంగా మారింది. నవంబర్ 11న జిల్లా కలెక్టర్‌పై దాడి జరిగింది. అంతకు రెండువారాల ముందు కొడంగల్‌కు చెందిన పలువురు బీఎస్పీ కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి.. కేటీఆర్‌తో భేటీ అయినట్టు పోలీసుల అంచనా. నిందితులు నోరైనా విప్పాలి? లేకుంటే ఫోన్ డేటా రికవరీ అయినా కావాలి? ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితే కేసు కీలక మలుపు తిరిగే అవకాశముందని అంటున్నారు కొందరు పోలీసు అధికారులు.