Khammam: ఖమ్మంలో కాంగ్రెస్ మేనియా కనిపిస్తోంది. ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలతో కొత్త శోభను సంతరించుకుందనే చెప్పాలి. ఇప్పటికే జనగర్జన సభకు లక్ష మంది తరలిరాగా.. ఇంకా లక్షలాది మంది ఖమ్మంవైపు పరుగులు తీస్తున్నారు. మొత్తం 5 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచాన వేస్తుండటంతో.. కనీ, వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు.
వచ్చే ఎన్నికలకు ఖమ్మం నుంచే శంఖారావం పూరించబోతోంది టీ కాంగ్రెస్. ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు.. ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అదే సమయంలో పీపుల్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా.. భట్టి విక్రమార్కను ఘనంగా సత్కరించనున్నారు. ఒకే వేదికపై రెండు భారీ కార్యక్రమాలు జరగనున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ చరిత్రలోనే రికార్డ్ సృష్టించేలా ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న జనగర్జన సభ కోసం ఖమ్మం నగరం అందంగా ముస్తాబైంది. ఖమ్మం నగరంలో అడుగడుగునా మూడు రంగుల జండాలే దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా కాంగ్రెస్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. పట్టణంలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కూడళ్లు, విద్యుత్ స్థంభాలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నాయి. పట్టణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, హోర్డింగ్ లు, భారీ కటౌట్ లు, పెద్దపెద్ద బెలూన్స్ ఎగరేశారు. రాహుల్ కు యూత్ కాంగ్రెస్ భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలకనుంది. ప్రస్తుతం ఈ సభ వైపే యావత్ తెలంగాణ ఆసక్తిగా చూస్తోంది.
సభా వేదికపైనే 200 మంది కూర్చోనేలా ఏర్పాట్లు చేశారు. 55 అడుగుల ఎత్తులో 144 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో 200 మంది కూర్చొనేలా సభా వేదికను నిర్మించారు. 140 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తులో భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సభాస్థలిని 100 ఎకరాల్లో ఏర్పాటు చేయగా… వేదిక ముందు లక్షా 50 వేల మంది కూర్చొని వీక్షించేలా గ్యాలరీలు, కుర్చీలు సిద్ధం చేశారు. అలాగే మిగతా వారు సభను వీక్షించేలా 12 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతోపాటు మరో 4 లక్షల మంది నిల్చొని చూసేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు.