Senior CPI Leader Sudhakar Reddy: కమ్మూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి(83) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్దాప్యం, అనారోగ్య సమస్యలతో సుధాకర్ రెడ్డి మరణించినట్లు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు తెలిపారు.
సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం
సీపీఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మాజీ సీఎం కేసీఆర్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలు పార్టీల నేతలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
దేశ రాజకీయాల్లో ముద్ర వేసిన గొప్ప నాయకున్ని కోల్పోయాం- సీఎం
సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా సురవరం ఎదిగారని.. ఎన్నో వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేశారు. రెండు సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప నాయకుడు అని చెప్పారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకున్ని కోల్పోయామని.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రజానేతగా సురవరం గొప్ప పేరు సంపాదించుకున్నారు- కేసీఆర్
ప్రజానేతగా సురవరం గొప్ప పేరు సంపాదించుకున్నారని చెప్పారు మాజీ సీఎం కేసీఆర్. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం జీవితకాలం కృషి చేశారన్నారు. తెలంగాణ మట్టి బిడ్డగా, మార్క్సిస్టు ప్రజానేతగా గొప్ప పేరు సంపాదించుకున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. సురవరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Also Read: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
మా కుటుంబానికి తీరని లోటు- నారాయణ
సురవరం సుధాకర్ రెడ్డి మరణించారని తెలిసి షాకింగ్‌కు గురయ్యానన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తనను స్టాలిన్ బాబు సీపీఐ వైపు ఆకర్షిస్తే, సుధాకర్ రెడ్డి పార్టీలో నా ఎదుగుదలకు ప్రతిసందర్భంలోనూ ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి అతిసన్నిహితులు అన్నారు. వారి మరణం సీపీఐకి, వామపక్ష ఉద్యమానికి, ప్రజాస్వామ్య ఉద్యమానికి, నాకు, మా కుటుంబానికి తీరని లోటని నారాయణ సంతాపం తెలిపారు.
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్
ఒక మంచి వామపక్ష భావజాలం కలిగిన నాయకుడిని తెలంగాణ కోల్పోయింది
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపం… https://t.co/KrelhA6wqh pic.twitter.com/S0L644ryow
— BIG TV Breaking News (@bigtvtelugu) August 23, 2025