Telangana politics: తెలంగాణలో మళ్లీ టీడీపీ యాక్టివ్ అవుతుందా? స్థానిక సంస్థలకు నేతలను సిద్ధం చేస్తున్నారా? జూబ్లీహిల్స్ బైపోల్‌లో టీడీపీ మద్దతు ఎవరి వైపు? మంగళవారం రాత్రి వరకు జరిగిన తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారా? లేకుంటే బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అన్నారా? ఇంకా లోతుల్లోకి వెళ్తే..
తెలంగాణలో టీడీపీ ప్లాన్
చాలా కాలం తర్వాత అమరావతిలో తెలంగాణ టీడీపీ నేతలతో సుధీర్ఘంగా సమావేశమయ్యారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. మంగళవారం ఉండవల్లిలో జరిగిన సమావేశానికి తెలంగాణలో పలు జిల్లాల నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. అదే సందర్భంలో జూబ్లీహిల్స్ బైపోల్ అంశం చర్చకు వచ్చింది.
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉందన్నారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లలేమని నేతలకు అధినేత చెప్పారట. ఒకవేళ బీజేపీ మద్దతు కోరితే కలిసి పని చేయాలని అన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లేకుంటే తటస్థంగా ఉండాలని నిర్ణయించారు. అదే సమయంలో బీఆర్ఎస్- కాంగ్రెస్‌లకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థలపైనే టీడీపీ ఫోకస్
తెలంగాణ ప్రజల్లో టీడీపీ పట్ల ఆదరణ ఉందని, పార్టీని బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఇప్పటికే లక్షన్నరకు మంది కార్యకర్తలు పార్టీ సభ్యత్వం పొందారని అధినేతకు వివరించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీల నియామకాలు పూర్తి చేయాలని రెండు లేదా మూడు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారట అధినేత.
రాష్ట్రంలో టీడీపీని అట్టడుగు స్థాయి నుండి బలోపేతం చేయడానికి తాము రెడీగా ఉన్నామని నాయకులు తెలిపారు. తెలంగాణ అధ్యక్షుడి నియామకం డిలే కావడంతో తాత్కాలికంగా రాష్ట్ర స్థాయిలో కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని నేతలు కోరినట్టు తెలుస్తోంది. నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని సమర్థవంతమైన నాయకుడికి ఇస్తామని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.
ALSO READ: కాంగ్రెస్‌లో దుమారం రేపిన మంత్రి పొన్నం వ్యవహారం
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో అరవింద్ కుమార్ పేరు ఉన్నట్లు పార్టీ వర్గాల మాట. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని సూచన చేశారట అధినేత చంద్రబాబు. తెలంగాణ టీడీపీ నేతలు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రామ్మోహన్, నర్సిరెడ్డి, నందమూరి సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో అక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి విష్ణువర్థన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడింది. అక్కడి నుంచి మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ వైపు వెళ్లారు. 2018, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలుపొందారు. ఒకప్పుడు బలంగా ఉండే టీడీపీ, పొత్తుల నేపథ్యంలో దూరమైన విషయం తెల్సిందే.