Secunderabad Railway Staction: సౌత్ ఇండియాలో ప్రతిష్టాత్మక రైల్వే స్టేషన్ అయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించే పలు రైళ్లను ఇతర రైల్వే స్టేషన్ల నుంచి నడిపిస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో, వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో రైల్వే స్టేషన్ ను తీర్చి దిద్దుతున్నారు. పనులకు ఆటంకం కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మరికొన్ని రైళ్లను డైవర్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 20 నుంచి 26 వరకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన రైళ్లను ఇతర స్టేషన్ల నుంచి నడపాలని అధికారులు నిర్ణయించారు.
ఇతర స్టేషన్లకు డైవర్ట్ చేసిన రైళ్లు ఇవే!
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తున్న రైళ్లను సమీప రైల్వే స్టేషన్లతో పాటు నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నడిపించాలని అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్-పోర్బందర్ ఎక్స్ ప్రెస్ ఉందానగర్ నుంచి నడిపించనున్నారు. సిద్దిపేట-సికింద్రాబాద్ రైలు ఇకపై మల్కాజిగిరి నుంచి రాకపోకలు కొనసాగించనుంది. పుణే-సికింద్రాబాద్ సర్వీసు హైదరాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరనుంది. మరికొన్ని రైళ్లను చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించిన సికింద్రాబాద్ – మణుగూరు, సికింద్రాబాద్ – రేపల్లె, సికింద్రాబాద్ – సిల్చార్, సికింద్రాబాద్ – దర్భంగా, సికింద్రాబాద్ – యశ్వంత్ పూర్, సికింద్రాబాద్ – అగర్తలా, సికింద్రాబాద్ – ముజఫర్ పూర్, సికింద్రాబాద్ – సంత్రగచ్చి, సికింద్రాబాద్ – దానాపూర్, సికింద్రాబాద్ – రామేశ్వరం రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి.
తాత్కాలికంగా ప్రయాణీకులకు ఇబ్బందులు కలిగినప్పటికీ..
సికింద్రాబాద్ నుంచి నడిచే పలు రైళ్లు ఇతర స్టేషన్ల నుంచి రాకపోకలు కొనసాగించడం వల్ల ప్రయాణికులకు కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ, భవిష్యత్తులో మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు సాయపడే అవకాశం ఉందన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తయితే ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నిర్మాణ పనులు కేవలం స్టేషన్ భవనాలకే పరిమితం కాకుండా, రైళ్ల రాకపోకల పైనా ప్రభావం చూపిస్తోంది. పనులు పూర్తయిన తర్వాత తిరిగి యథావిధిగా రైళ్లను సికింద్రాబాద్ నుంచి నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు
అటు సికింద్రాబాద్ నుంచి ఇతర స్టేషన్లకు పలు రైలు సర్వీసులను మార్చడం ద్వారా ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. చర్లపల్లి లాంటి స్టేషన్లలో ప్రయాణీకుల సంఖ్య పెరగడం వల్ల అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణీకులకు అవసరమైన సమచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందుగా రైల్వే వెబ్ సైట్ లేదంటే యాప్ ను సందర్శించి రైళ్ల వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచించారు. షెడ్యూల్ కు కనీసం గంట ముందు రైల్వే స్టేషన్ కు చేరుకోవడం ద్వారా ప్రయాణాల్లో ఇబ్బందులను తొలగించుకునే అవకాశం ఉందన్నారు.
Read Also: దీపావళి సందడి.. ఆ ఒక్క రాష్ట్రానికే 12 వేల ప్రత్యేక రైళ్లు!