Leopard Attack: స్వేచ్ఛ బ్యూరో: చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అది ఎప్పుడు ఎక్కడ నుంచి దాడి చేస్తుందోనని గ్రామాలకు దూరంగా పొలాలలో పనులు చేసుకునే రైతులు భయాన్ని గుప్పెట్లో పెట్టుకొని జీవనాన్ని సాగిస్తున్నారు. గత నాలుగు నెలల క్రితం ధరూర్ , కేటి దొడ్డి మండలాల్లో పొలం దగ్గర కట్టేసిన లేత ఆవు దూడలను చంపగా ప్రజలు ఆందోళన చెందారు. పలుమార్లు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా వాటి జాడలను సైతం గుర్తించారు. ఇటీవల మల్దకల్ మండలంలోని నేతివానిపల్లి గ్రామంలో మూడు నెలలుగా ఓ గుర్తు తెలియని జంతువు లేగ దూడలు, గొర్రెలు, మేకలపై దాడి చేసిన ఘటనలు గ్రామస్తులను భయాందోళనకు గురి చేశాయి. విషయాన్ని పరిసర గ్రామాల ప్రజలు గద్వాల జిల్లా ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు గత గురువారం అటవీ ప్రదేశంలో పంట పొలాల మధ్య సీసీ కెమెరాలు అమర్చారు. ఆ రాత్రి ఓ లేగ దూడపై చిరుత పులి దాడి చేసి ఈడ్చుకు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. లేగ దూడకు సంబంధించిన రైతు దూడను ఈడ్చుకేళ్ళిన ప్రదేశానికి పరిశీలిస్తూ వెళ్లగా గుట్టల మధ్య దూడను చంపి తినేసింది. విషయాన్ని గ్రామస్తులతో పాటు ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. ఇప్పటి వరకు గ్రామ శివారులో 10 లేగ దూడలు చిరుత దాడిలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం ఫారెస్ట్ అధికారులు నేతువానిపల్లి గ్రామ శివారులో లేగ దూడపై దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. సోలార్ కెమెరా ఫుటేజీ ఆధారంగా చిరుత పులి ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఓ కుక్క మీద కూడా దాడికి ప్రయత్నించింది.
జిల్లాలోని నీటిపారుదల సౌకర్యం ఉన్న ధరూరు, మల్దకల్ మండలాలలో ప్రధాన కాలువల గుండా రిజర్వాయర్ గుట్టలు ఉన్నాయి. సమీప గ్రామాల ప్రజలు ఇంటిదగ్గర మేత ఇతరత్రా కారణాలతో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో రైతులు వారి పొలాల దగ్గరే తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేసి అందులో పశువులను ఉంచుతున్నారు. ఇదే అదునుగా భావించిన చిరుత మాటువేసి రాత్రి వేళల్లో దాడి చేస్తోంది. చిరుత సంచారం దృష్ట్యా పశువులను రాత్రివేళ ఇంటి వద్ద ఉంచుకోవాలని ఫారెస్ట్ అధికారి సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఫారెస్ట్ అధికారితో పాటు ఇతర ఉన్నతాఅధికారులకు పరిస్థితిని ఇప్పటికే నివేదిక ఇచ్చామన్నారు.వారి తదుపరి ఆదేశాలకనుగూణంగా త్వరలో చిరుత పులిని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, అప్పటివరకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే మాదిరి మహబూబ్ నగర్ ఏరియాలో మూడు చిరుతలు ఉంటే రెండు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోగా, ఒక చిరుతను అదుపులోకి తీసుకున్నారన్నారు.
Also read: మీకు ఫ్యాన్సీ నంబర్ కావాలా.. అయితే రవాణా శాఖ కొత్త రూల్స్.. ఇలా అప్లై చేయండి..?
ప్రస్తుత వేసవిలో ఖరీఫ్ కు భూములను సిద్ధం చేసుకున్నందుకు గత పంటలను తొలగించే భూములను చదును చేసుకునే ప్రక్రియను చేపడుతున్నారు. ఇప్పటికే చిరుత సంచారంతో ఆందోళనలో ఉన్న రైతులు పొలాలకు ఒంటరిగా పోవాల్సి వస్తోందని ఎక్కడ తమపై దాడి చేస్తుందనే కారణంతో బిక్కు బిక్కు మంటూ పొలాలకు పోతూ వ్యవసాయ పనులు కొనసాగించుకుంటున్నారు.
త్వరలో చిరుత పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తామని అప్పటివరకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా ఎవరూ పొలాల వైపు వెళ్లవద్దని, పొలాల గట్లపై మంటలు వేసి మైక్ శబ్దం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇప్పటికీ అధికారులకు నివేదిక ఇచ్చామని వారి ఆదేశాలకు అనుగుణంగా చిరుతను సురక్షితంగా బంధించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు.
Also read: సైబర్ ఉచ్చులో చిక్కుకొని.. చివరికి తానే నేరస్థుడు అయ్యాడు.. హైదరాబాద్‌లో వింత కేసు!