Health Negligence: స్వేచ్ఛ బ్యూరో: హుజూరాబాద్ మండల పరిధిలోని వైద్య సేవలను మెరుగుపరచడంలో భాగంగా, చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కందుగుల ఆరోగ్య ఉప కేంద్రాన్ని హుజూరాబాద్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో (Dy.DM&HO) డాక్టర్ శ్రవణ్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (CHO) సదానందం కూడా పాల్గొన్నారు.
తనిఖీ సమయంలో ఉపకేంద్రంలోని రికార్డులను, అందుతున్న వైద్య సేవలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, విధి నిర్వహణలో ఉండాల్సిన ఏఎన్ఎంలు (ANMs) సైదా , సుమలత ,లు, ఇద్దరూ కూడా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ముందస్తు సమాచారం లేకుండా, విధులకు గైర్హాజరు కావడం పట్ల డాక్టర్ శ్రవణ్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.
Also Read: విడాకుల విషయంలో పశ్చాత్తాపం లేదు.. సంతోషంగా ఉన్నా.. ఫస్ట్ టైం స్పందించిన హన్సిక!
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సదరు ఏఎన్ఎంలపై తక్షణ చర్యలకు అధికారులు ఆదేశించారు. విధులకు ఎందుకు గైర్హాజరయ్యారో తగిన కారణాలతో వివరణ ఇవ్వాలని కోరుతూ సైదా మరియు సుమలతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో తెలిపారు. వివరణ సంతృప్తికరంగా లేని పక్షంలో ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజారోగ్య విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు వైద్యం అందించే ఉపకేంద్రాల్లో సిబ్బంది సమయపాలన పాటించాలని, లేనిపక్షంలో శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో స్థానిక ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.