Telangana Govt: హైదరాబాద్ సిటీలో ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై తెలంగాణ స్టేట్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పదే పదే దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో కేఎఫ్‌సీ-7,డొమినోస్ పిజ్జా-2 ఔట్‌లెట్ల లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.
హైదరాబాద్ నగరంలో ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేశారు తెలంగాణ స్టేట్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అధికారులు. వారంలో నాలుగైదు సార్లు దాడులు చేస్తున్నారంటే నగరంలో వాటి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం 13 బృందాలు సిటీ వ్యాప్తంగా రెండు సంస్థలకు చెందిన 26 ఔట్‌లెట్లలో ఏక కాలంలో దాడులు చేపట్టారు. అపరిశుభ్రత వాతావరణం, నాణ్యతా లోపాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని తేల్చేశారు అధికారులు.
బొద్దింకల బెడద, ఎలుకల రెట్టలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, వంట గదులలో దుర్వాసన ఉన్నట్లు తనిఖీలలో వెల్లడైంది. దీంతో కేఎఫ్‌సీ-7, డొమినోస్ పిజ్జా-2 ఔట్‌లెట్ల లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు. లైసెన్సులు సస్పెండ్ చేసిన వాటిలో మియాపూర్‌లోని మదీనాగూడ, సింధీ కాలనీ, చార్మినార్ సమీపంలోని పంచ్ మొహల్లా, మూసారాంబాగ్, బంజారాహిల్స్, హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక, మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో కేఎఫ్‌సీ ఔట్‌లెట్లను నిలిపి వేశారు. కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్, మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో రెండు డొమినోస్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి.
ALSO READ: అక్రమ అండాల ముఠాతో 23కు పైగా ఐవీఎఫ్ సెంటర్లు.. ఎక్కడో తెలుసా..?
బంజారాహిల్స్‌లోని కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌లో నీరు నిలవడం, మెగ్నీషియం సిలికేట్ వాడకం ఉన్నట్లు తెలిపింది. కేఎఫ్‌సీ శిల్ప కళా వేదిక అవుట్‌లెట్‌లో అపరిశుభ్రమైన ఆహార తయారీ పరికరాలు, పాత్రలతోపాటు పదార్థాలను కనుగొన్నారు. శరత్ సిటీ మాల్‌లోని డొమినోస్ అవుట్‌లెట్‌లో బొద్దింకల బెడద, గడువు ముగిసిన ఉత్పత్తులు ఉపయోగించడం, ప్యాకేజింగ్ మెటీరియల్‌కు ఫుడ్-గ్రేడ్ సర్టిఫికేట్ లేకపోవడం ఉన్నాయి. ఇన్‌ఆర్బిట్ మాల్‌లోని డొమినోస్ అవుట్‌లెట్‌లో ఆహారాన్ని నిర్వహించేవారు హెయిర్ నెట్‌లు, ఆప్రాన్‌లు లేకుండా పని చేయడం గుర్తించారు.
ఇదేకాకుండా డొమినోస్ అవుట్‌లెట్‌లో చిందరవందరగా స్టోర్‌రూమ్, ఎలుకల రెట్టలు, బొద్దింకలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. నిజాంపేట్, మియాపూర్, హిమాయత్‌నగర్, మలక్‌పేట్‌లోని డొమినోస్ శాఖలకు, కొండాపూర్, కర్ఖానా, హిమాయత్‌నగర్, షేక్‌పేట్‌లోని నాలుగు కేఎఫ్‌సీ శాఖలకు నోటీసులు జారీ చేయబడతాయి. ఆహార భద్రతా నిబంధనల కోసం ఈ అవుట్‌లెట్లను ఎప్పుడైనా తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.