Sweet Manufacturing Units: పర్యావరణ నిబంధనలను గాలికొదిలేసి కాలుష్యానికి కారణమవుతున్న స్వీట్ తయారీ కేంద్రాలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) కొరడా ఝళిపించింది. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పీసీబీ రోలింగ్ టాస్క్‌ఫోర్స్.. నగరంలోని 7 ప్రధాన స్వీట్ తయారీ యూనిట్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాయి. 7 యూనిట్ల నిర్వాహకులను విచారించాయి. వీటిలో 4 యూనిట్లకు అనుమతులు ఉండగా.. మిగిలిన 3 కేంద్రాలకు అవేమి లేనట్లు తేలింది.
మరోవైపు ఆయా స్వీట్ యూనిట్లు వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ (ఈటీపీ) ఏర్పాటు చేయకుండా మురుగునీటిని నేరుగా కాలువల్లోకి వదులుతూ జల కాలుష్యానికి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. 2021 ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘిస్తూ స్వీట్ బాక్సులకు ప్లాస్టిక్ ఫిల్మ్ చుట్టడం, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటాన్ని తీవ్రంగా పరిగణించారు.
నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించినందుకు గాను ఒక్కొక్క యూనిట్‌కు రూ.లక్ష చొప్పున అధికారులు జరిమానా విధించారు. అనుమతులు లేకుండా నడుస్తున్న యూనిట్లు వెంటనే నిర్వహణ అనుమతి (సీఎఫ్ఓ) కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు సంబంధించి హామీ పత్రం ఇవ్వాలని ఆదేశించారు. జల, వాయు కాలుష్య నివారణ చట్టాలను ఉల్లంఘించి, అనుమతుల్లేకుండా కార్యకలాపాలు సాగించినందుకు పర్యావరణ పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు.
Also Read: రసగుల్లా అని నమ్మించి.. నాటు బాంబు ఇచ్చారు.. నోట్లో వేసుకోగానే పేలి వ్యక్తి మృతి!
శుద్ధి చేయని వ్యర్థ జలాలను కాలువల్లోకి వదలకుండా కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)కు తరలించాలని ఆదేశించారు. భవిష్యత్తులో నిబంధనలు అతిక్రమిస్తే మరింత కఠిన చర్యలు తప్పవని స్వీట్ యూనిట్ల నిర్వాహకులను పీసీబీ హెచ్చరించింది.
Also Read: ఇరాన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు.. ఫోన్ కాల్‌లో తీవ్ర వాగ్వాదం?