Local Body Elections: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్‌లో స్థబ్ధత కొనసాగుతూనే ఉంది .. నేతల అంతా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కారణాలు ఏవైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రాకపోతుండటంతో కేడర్‌కు పార్టీ నేతలు అందుబాటులో లేకుండా పోతున్నారన్న విమర్శలున్నాయి. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవాలని ప్రకటనలు చేస్తున్న గులాబీ పార్టీ నేతలు .. అందుకు అనుగుణంగా క్యాడర్‌ను సన్నద్ధం చేయడానికి కార్యాచరణ చేపట్టక పోతుండంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామ స్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య విభేదాలు
తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్‌కు పెను సవాలుగా మారాయి . గ్రామస్థాయిలో నేతలంతా పోటీచేసే అభ్యర్ధిపై ఏకాభిప్రాయానికి రావాలని గులాబీ పార్టీ పెద్దలు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటివరకు గ్రామస్థాయిలో నేతల మధ్య ఉన్న అగాధంను పూడ్చేందుకు పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేపట్టలేదు. పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోలేదు. ఈ తరుణంలో స్థానిక సంస్థల్లో పోటీచేసే అభ్యర్ధితో ఆయా వర్గాలు ఎలా కలిసి పనిచేస్తారనేది పార్టీ కేడర్ లోనే చర్చకు దారితీస్తోంది
పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టని బీఆర్ఎస్ అధిష్టానం
రెండు సార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గులాబీపార్టీ.. కేసీఆర్ వన్ మాన్‌తో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించలేదు. ఆ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో పరాజయాలు మూటగట్టుకుంది. ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి పెద్దగా ప్రజాక్షేత్రంలో కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఉనికి కాపాడుకోవడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ బీఆర్ఎస్‌కు కీలకంగా మారాయి. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. ఈ గెలుపుతో పార్టీ కేడర్ లో నూతనోత్తేజం తీసుకొస్తేనే భవిష్యత్‌లో పార్టీకి మనుగడ అని అధిష్టానం సైతం భావిస్తుంది.
గ్రామ స్థాయి నేతల అభిప్రాయం తీసుకోవడం లేదని విమర్శలు
అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే మండలాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తోంది. కానీ గ్రామస్థాయిలో ఉండే నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల అభిప్రాయాలను మాత్రం తీసుకోవడం లేదని పలువురు బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు పార్టీలో ఏంజరుగుతుందో తెలియదు.. కానీ గెలవాల్సిందేననే ఆదేశాలు ఇస్తే .. ఎలా విజయం సాధిస్తారనే ప్రశ్నలు సంధిస్తున్నారట.
గ్రూపులు కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి
మరోవైపు పార్టీలో గ్రూపులు కొనసాగుతున్నాయి. ఆ గ్రూపులే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యాయని పార్టీ సీనియర్లే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ గ్రామస్థాయిలో నేతల అభిప్రాయాన్ని అధిష్టానం తెలుసుకునే ప్రయత్నం చేయడంలేదని నేతలు మదన పడుతున్నారు. ఈ తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండటంతో ఎలా నేతల మధ్య సమన్వయం కుదురుతుందనేది ప్రశ్నగా మారింది. పోటీచేసే అభ్యర్థికి వ్యతిరేక గ్రూపులు ఎలా సహకరిస్తాయనేది సమాధానం లేని ప్రశ్నగా మారిందంటున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు పార్టీ కమిటీలు లేవు. కేవలం అధ్యక్షులను మాత్రమే బీఆర్ఎస్ అధిష్టానం నియమించింది. ఏళ్ల తరబడి కమిటీలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు అసంతృప్తితో ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఏ పదవి లేకుండా పార్టీలో ఎలా పనిచేయాలని క్యాడర్ ప్రశ్నిస్తోందంట.
తరచే ఫాంహౌస్‌లో నేతలతో కేసీఆర్ భేటీలు
ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కేసీఆర్ తరచూ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. నేతల మీటింగ్‌లో ఏ అంశాలు చర్చిస్తున్నారనేది బయటకు చేప్పకపోయినా…కేసులు, ప్రాజెక్టులపై చర్చ, విచారణ కమిషన్ లను ఎలా ఎదుర్కోవాలి, పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై ఎలా ఫైట్ చేయాలి అనే అంశాలపైనే చర్చజరుగుతున్నట్లు నేతలు ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నారంట. మరోవైపు త్వరలో స్థానిక సంస్థలు జరుగనున్న నేపథ్యంలోనూ పార్టీ స్థబ్ధతుగా ఉండటంతో కేడర్ లో ఆందోళన నెలకొందంటున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటముల నుంచి ఇంకా నాయకులు, కేడర్ బయటపడలేదు. వారిలో జోష్ నింపేందుకు పార్టీ సైతం ఎలాంటి కార్యచరణ ప్రకటించకపోవడం గందరగోళాన్ని పెంచుతోందంట.
Also Read: 51వ CRDA సమావేశం.. అమరావతి డెవలప్‌మెంట్‌కు ఎన్ని కోట్లు అంటే..!
గ్రూపులకు చెక్ పెడితేనే మెజార్టీ సీట్లు వస్తాయని సూచనలు
అయితే ఫస్ట్ గ్రామస్థాయిలో పార్టీనేతలతో ముఖాముఖీ నిర్వహించి సమస్యలను తెలుసుకొని, గ్రూపులకు చెక్ పెడితేనే స్థానిక సంస్థల్లో పార్టీ అధిష్టానం ఆశించిన విధంగా మెజార్టీ సీట్లు వస్తాయని .. లేకుంటే పార్టీకి గడ్డుకాలం తప్పదని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా పార్టీ చర్యలు తీసుకుంటుందా? లేదా? లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి పరాభవం తప్పదా అన్నది చూడాలి.
Story By Rami Reddy, Bigtv