Jubilee Hills bypoll: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు వివిధ పార్టీల నేతలు. దీంతో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు తర్జనభర్జన పడుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు తలోవిధంగా చర్చించుకోవడం మొదలైంది.
మైండ్ గేమ్ మొదలైందా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 13న సోమవారం విడుదల కానుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతను ఎంపిక చేశాయి. బీజేపీ అభ్యర్థి ఎవరనేది తెలియాల్సి ఉంది. నోటిఫికేషన్ విడుదలకు సమయం ఉండడంతో రాజకీయ పార్టీల మధ్య మైండ్ గేమ్ మొదలైంది. గురువారం బీజేపీ నుంచి ఓ వార్త హంగామా చేసింది.
బొంతు రామ్మోహన్‌కు బీజేపీ టికెట్ ఇస్తే బాగుంటుందని ఓ ఎంపీ ప్రతిపాదన చేసినట్టు ప్రచారం సాగింది. ఈ విషయం తెలియగానే బొంతు రామ్మోహన్ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామమోహన్‌రెడ్డి ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. బీఆర్ఎస్-బీజేపీ పార్టీల జెండాలతో కూడిన ఫోటో పెట్టి బైపోల్‌లో ఈ రెండు పార్టీలు ఒక్కటే అని అర్థం వచ్చేలా చేశారు.
రామమ్మోహన్ పోస్టుపై చర్చ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి బిఆర్ఎస్సేనని రాసుకొచ్చారు. కారు గుర్తుకి ఓటు, కమల బలోపేతానికే.. దిక్కుతోచని స్థితిలో బీజేపీ కార్యకర్తలు, బిఆర్ఎస్ మైనారిటీ నాయకులు అని ప్రస్తావించారు. బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా సునీత పేరు ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి ఎవరనేది తేలాల్చివుంది. ఈ లెక్కన రెండు పార్టీలు ఏమైనా ఒప్పందం జరిగిందా అంటూ చర్చించుకోవడం ఆయా పార్టీల కార్యకర్తల వంతైంది.
ALSO READ: హైదరాబాద్ శివారులో మొసలి హంగామా
పట్టభద్రుల, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పుకోవడంతో బీజేపీ పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ రేసు నుంచి బీజేపీ తప్పుకుంటుందా? అన్న చర్చ మొదలైంది. అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలీదుగానీ, రామమోహన్‌రెడ్డి పోస్టుపై చిన్నపాటి చర్చ కార్యకర్తల్లో మొదలైంది. కొందరు నేతలు ఇదంతా మైండ్ గేమని అంటున్నారు. కార్యకర్తలను డైవర్ట్ చేసేందుకు ఈ ఎత్తుగడని అంటున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో..
బీజేపీ అభ్యర్ధి బిఆర్ఎస్సే..కారు గుర్తుకి ఓటు కమల బలోపేతానికే..
దిక్కుతోచని స్థితిలో బీజేపీ కార్యకర్తలు, బిఆర్ఎస్ మైనారిటీ నాయకులు..
BJP=BRS#JubileeHillsByElection pic.twitter.com/YsxkhWoELT
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) October 10, 2025