CM Progress Report: సమీక్షలు, సమావేశాలు.. కీలక నిర్ణయాలు, ప్రారంభోత్సవాలు.. కీలక ఆదేశాలు, అధికారులకు వార్నింగ్‌లు.. ఈ వీక్ కూడా ఏపీ పాలనకు సంబంధించి చాలా విషయాలు జరిగాయి. మరి ఈ వీక్‌లో ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలు నిర్ణయాలు ఏంటి? ఆ నిర్ణయాలు ఏపీ డెవలప్‌మెంట్‌పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి..? వీటికి సంబంధించిన అన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం.
18-08-2025 ( సోమవారం) ( (51వ CRDA సమావేశం)
51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో 9 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలో చేపట్టే వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుకు సీఆర్డీఏ అథారిటీ తన ఆమోదాన్ని తెలియచేసింది. రాజధానిలో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు, స్పోర్ట్స్ సిటీ , స్మార్ట్ ఇండస్ట్రీస్, రివర్ ఫ్రంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, రోప్ వే లాంటి ప్రాజెక్టులకు ఈ ఎస్పీవీ పని చేయనుంది. భూసమీకరణ పథకం కింద ఇచ్చే యాజమాన్య ధృవీకరణ సర్టిఫికెట్‌లో అసైన్డ్ అనే పదాన్ని తొలగిచేందుకు కూడా సీఆర్డీఏ అథారిటి ఆమోదాన్ని తెలిపింది. అమరావతి రాజధాని నగరంలో సివరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు 411 కోట్లు, అలాగే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను రూ. 376 కోట్లతో ఏర్పాటు చేసేందుకు అథారిటీ అంగీకరించింది. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు కూడా అదనపు భూ కేటాయింపులు చేసేందుకు సీఎం అధ్యక్షతన అథారిటీ ఆమోదం తెలిపింది. 904 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు CRDA అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
19-08-2025 ( మంగళవారం) ( మనసున్న వారి కోసమే)
పేదరిక నిర్మూలన కోసమే పీ4 కార్యక్రమం చేపట్టామని మరోసారి గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ఎవరినీ బలవంతం చేయడం లేదన్నారు. ఇది మనసున్న వారి కోసం ఏర్పాటుచేసిన పథకమని తెలిపారు. పీ4 కార్యక్రమం పై మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
19-08-2025 ( మంగళవారం)( స్త్రీ శక్తిపై సీఎం రివ్యూ )
ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం కోసం రూపొందించిన స్త్రీ శక్తిపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ పథకానికి మహిళల నుంచి అద్భుతమైన స్పందన కనిపించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పథకం ప్రవేశపెట్టిన నాలుగు రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగా దాదాపు 19 కోట్ల మేర వారికి ఆదా అయిందన్నారు. ఘాట్ రూట్‌లలోని ఆర్టీసీ సర్వీసుల్లో కూడా స్త్రీ శక్తి పథకం అమలుకు సీఎం అంగీకారాన్ని తెలిపారు.
20-08-2025 (బుధవారం) ( 10 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం )
వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు సీఎం చంద్రబాబు. గృహ నిర్మాణ శాఖ సంబంధిత అంశాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మరో 3 నెలల్లో 3 లక్షల ఇళ్లు, సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తి కావాలని ఆదేశించారు. పట్టణ పేదలకు 2 సెంట్లు, గ్రామీణ పేదలకు 3 సెంట్లు భూమి కేటాయిస్తామనే హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశాలిచ్చారు.
20-08-2025 (బుధవారం)( సీఎం దిగ్భ్రాంతి)
కర్నూలు జిల్లా,చిగిలిలో ఆరుగురు చిన్నారుల మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదో తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ అనే ఆరుగురు విద్యార్థులు ఆడుకుంటూ నీటికుంటలో పడి మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోతను మిగిల్చిందన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
20-08-2025 (బుధవారం)( రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం)
మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో కలిసి సీఎం ప్రారంభించారు. రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నామని.. రతన్ టాటా నిరాడంబరత, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శమన్నారు సీఎం. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఇన్నోవేషన్ కేంద్రాలు ఉండాలని నిర్ణయించామన్నారు సీఎం చంద్రబాబు. యువతకు ఉన్న వినూత్న ఆలోచనల్ని డీకోడ్ చేసి ప్రోత్సహించేలా ఈ ఇన్నోవేషన్ హబ్ పని చేస్తుందన్నారు. యువపారిశ్రామిక వేత్తలు అవకాశాలను వాడుకోవాలని.. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయన్న అంశాన్ని తాను విశ్వసించనన్నారు.
21-08-2025 (గురువారం) ( పెన్షన్లపై రివ్యూ)
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నవారిపై ఇటీవల నిర్వహించిన రీసర్వే వివరాలను అధికారులు సీఎం ముందుంచారు. ప్రత్యేక వైద్య బృందాలను నియమించి సదరం సర్టిఫికెట్ల తిరిగి పరిశీలించినట్లు తెలిపారు. అర్హులైన వారిలో ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దని సీఎం ఆదేశించారు. తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పెన్షన్, హెల్త్ పెన్షన్ పొందేవారికి కూడా ఎప్పటిలా నెలనెలా పింఛన్ అందించాలని సీఎం స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని చెప్పారు. అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు కొనసాగుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
21-08-2025 (గురువారం)( ఏపీఎంతో ఒప్పందం )
రాష్ట్రంలోని ఓడరేవుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఏపీఎం టెర్మినల్స్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో రూ.9 వేల కోట్లతో ఆధునిక టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఏపీఎం టెర్మినల్ సంస్థ పలు దేశాల్లో పోర్టు ఆధారిత సదుపాయాలు నిర్వహిస్తోంది. ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్‌లను కూడా చూసుకుంటోంది. ఈ సంస్థ ఇప్పుడు రాష్ట్రంలోని ఓడరేవుల్లో ఆధునిక టెర్మినల్స్ ఏర్పాటు చేయనుంది.
22-08-2025 (శుక్రవారం) ( రాధాకృష్ణన్‌తో భేటీ)
NDA కూటమి ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. రాధాకృష్ణన్ గౌరవించదగ్గ వ్యక్తి అని.. తన పనితీరుతో దేశ గౌరవాన్ని పెంచుతారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
22-08-2025 (శుక్రవారం) (కేంద్ర ఆర్థికమంత్రితో భేటీ)
ఢిల్లీలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరారు. ఏపీకి ఇప్పటి వరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద 2 వేల 10 కోట్లు లభించాయని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అదనంగా 5 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి పథకాలకు కేంద్రం అండగా నిలవాలని కోరారు చంద్రబాబు.
22-08-2025 (శుక్రవారం) ( గ్యాస్ లీక్‌పై సమీక్ష)
కాకినాడ జిల్లా ధరియాల తిప్ప సమీపంలో.. సముద్రంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్ ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అర్ధరాత్రి 1.30 గంటకు గ్యాస్ లీక్ తో మంటలు భారీగా ఎగిసి పడ్డాయని, గంటన్నర వ్యవధిలోనే గ్యాస్ సరఫరా నిలిపివేసి లీక్ అరికట్టామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. లీక్ అయిన పైప్ ను మొత్తం తనిఖీ చేసి సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
22-08-2025 (శుక్రవారం) ( ఎరువుల కొరతపై ఫోకస్)
రాష్ట్రంలో ఎరువులు, పురుగు మందుల లభ్యత, సరఫరా అంశంపై కూడా సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. కృత్రిమ కొరత సృష్టించినా, దారి మళ్లించినా సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువులు, పురుగుమందుల లభ్యత, సరఫరా అంశంపైనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజిలెన్స్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఎరువులు దారి మళ్లకుండా, ధరలు పెరగకుండా చూడాలని ఆదేశించారు. ఎరువుల కొరత అనే సమస్య ఉన్నట్లు ఎక్కడ నుంచి సమాచారం వచ్చినా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
22-08-2025 (శుక్రవారం) ( వరదలపై అలర్ట్)
కృష్ణా, గోదావరి నదుల వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదులకు వస్తున్న వరద ప్రవాహాలు, పలు ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు, నివాస సముదాయాలకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.
23-08-2025 (శనివారం) (స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర)
కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. స్వచ్ఛతా ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అక్కడి మ్యాజిక్ డ్రెయిన్లను సీఎం పరిశీలించారు. వాటి నిర్మాణం, ఉపయోగం గురించి పారిశుధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీటి ద్వారా భూగర్భ జలాల పెరుగుదలతో పాటు పారిశుధ్య నిర్వహణ భారం కూడా తగ్గుతుందని కార్మికులకు వివరించారు.
23-08-2025 (శనివారం) (స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర)
స్వచ్ఛ ఆంధ్ర అంటే ఊళ్లో చెత్తను తీయడమే కాదు.. ఆలోచనలను కూడా స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలన్నారు. తాము చెత్తపై పన్ను రద్దు చేయడంతో పాటు.. ఇళ్లలో వ్యర్థాలకు డబ్బులు కూడా ఇస్తున్నామని తెలిపారు. వ్యర్థాలతో సంపదను సృష్టించేలా సర్క్యులర్ ఎకానమీ పాలసీని తీసుకువచ్చామన్నారు సీఎం చంద్రబాబు. వరి గడ్డి నుంచి అట్టపెట్టెల తయారీ, సముద్రపు నాచుతో బయోకెమికల్, ప్రొటీన్, మెడిసిన్ తయారుచేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని.. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధించి, ఈ-వ్యర్థాలను రీసైక్లింగ్ చేయిస్తామన్నారు. ఇళ్ల వద్దకే వాహనం పంపించి.. ప్లాస్టిక్, ఈ-వేస్ట్, ఇతర వ్యర్థాలను సేకరించి వాటికి డబ్బులిస్తున్నామని గుర్తు చేశారు.
23-08-2025 (శనివారం) ( కఠిన చర్యలు తప్పవు)
ఏలూరు జిల్లాలోని కలిదిండిలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి రంగా విగ్రహాలను ఎవరో కావాలనే ధ్వంసం చేసినట్టు అనుమానాలు ఉన్నాయి.
Story By Vamshi Krishna, Bigtv