Telangana Maoist Surrender: రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) శివధర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన రాష్ట్ర కమిటీ స్థాయి ముగ్గురు ప్రముఖ నాయకులు లొంగిపోయారు.
లొంగిపోయిన వారి వివరాల ప్రాకారం.. కొంకటి వెంకటయ్య, మొగిలి చర్ల వికాస్ రాజ్ (వెంకటరాజు), తోడెం గంగా ఉన్నారు. ఈ ముగ్గురు గత మూడున్నర దశాబ్దాలుగా.. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
సిద్ధిపేట జిల్లా కు చెందిన కొంకటి వెంకటయ్య.. 1990 లో పీడబ్ల్యూ రైతు కూలి సభలకు హాజరై అదే సంవత్సరం అజ్ఞాతంలోకి వెళ్ళారు.
అప్పట్లో దళ కమాండర్ అంజయ్య ప్రోత్సాహంతో మావోయిస్టు పార్టీలో చేరారు. 2007లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో నియమితులయ్యారు. అనంతరం 2015లో సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.
అనారోగ్య కారణాలతో 2021లో కార్యకలాపాలు విరమించుకున్నారు. చివరికి పోలీసుల పిలుపు మేరకు జనజీవన స్రవంతిలోకి చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
మొగిలి చర్ల వికాస్ రాజ్ (వెంకటరాజు)
హన్మకొండ జిల్లాకు చెందిన వికాస్ రాజ్, చిన్నతనంలోనే విప్లవ గీతాలకు ఆకర్షితుడయ్యాడు. ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఉద్యమ భావజాలం ప్రభావంతో 1990లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 1993లో నర్సన్నపేట దళంలో రిక్రూట్ అయ్యి, అనంతరం పాలకుర్తి దళంలో కూడా పనిచేశాడు. 2001లో దండకారణ్య ప్రాంతానికి బదిలీ అయ్యి, సాంస్కృతిక విభాగంలో – జన చైతన్య నాట్య మండలి ఇంచార్జిగా పని చేశాడు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో పలు విప్లవ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాడు. 2019 నాటికి చైతన్య నాట్య మండలి స్పెషల్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.
అయితే, పార్టీలో పెరుగుతున్న సిద్ధాంత విభేదాలు, నాయకత్వ మధ్య కలహాలు కారణంగా విసుగెత్తి బయటకు వచ్చాడు.
తోడెం గంగా
ఛత్తీస్గఢ్‌కు చెందిన తోడెం గంగా, 2009లో వికాస్ రాజ్‌ను వివాహం చేసుకుంది. ఆమె కుటుంబం ఆ వివాహానికి వ్యతిరేకించడంతో, భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తర్వాత భర్తతో కలిసి మావోయిస్టు ఉద్యమంలో భాగమైంది. ఇప్పుడు ఆమె కూడా ఉద్యమాన్ని వదిలి స్వచ్ఛందంగా లొంగిపోయింది.
డీజీపీ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలలో మొత్తం 412 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. వారిలో తెలంగాణకు చెందిన 72 మంది ఉన్నారు. ప్రస్తుతం సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీలో ఉన్న 12 మందిలో 10 మంది తెలంగాణకు చెందినవారు అని తెలిపారు.