Big Stories

Low Pressure Effect : అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

Low Pressure Effect on Telangana : తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ విభాగం తెలిపింది. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీ వరకూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

అలాగే శుక్రవారం (మే 24) కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, రంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. శనివారం (మే 25) మెదక్, కామారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని, ఆదివారం కూడా మెదక్, సంగారెడ్డి, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది వాతావరణ శాఖ.

- Advertisement -

Also Read :తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. చల్లబడనున్న వాతావరణం!

భాగ్యనగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మల్కాజ్ గిరి, ఉప్పల్, ఉస్మానియా, ఎల్ బీ నగర్, అబిట్స్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున జోరువాన కురిసింది. దీంతో నగరమంతా మబ్బులు కమ్మి వాతావరణం చల్లబడింది. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా, శనివారానికి తుపానుగా బలపడి ఈశాన్య, వాయవ్య బంగాళాఖాతం వద్దకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

ఈ తుపానుకు ఒమన్ దేశం సూచించిన రెమాల్ అనే పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలపై ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న క్రమంలో మత్స్యకారులు ఆదివారం (మే 26) వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News