Mahesh Kumar Goud: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు సమర శంఖం పూరించాయి. నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి భారీ ఎత్తున తరలివెళ్లేందుకు పీసీసీ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో డిసిసి అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొని కీలక చర్చలు జరిపారు.
రైళ్ల అనుమతి నిరాకరణపై మండిపాటు
నిరసన కోసం ఢిల్లీకి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రైళ్లను కేటాయించాలని దరఖాస్తు చేసుకుంటే, కేంద్ర రైల్వే శాఖ ఐదు రోజుల పాటు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చివరి నిమిషంలో దరఖాస్తును తిరస్కరించిందని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిరసనను అడ్డుకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఈ తరహా కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఢిల్లీకి వెళ్లి తీరుతామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు.
ప్రత్యేక బస్సులు.. పర్యవేక్షణకు మంత్రుల కమిటీ
రైళ్ల అనుమతి నిరాకరించడంతో ప్రత్యామ్నాయంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది. బస్సుల్లో ప్రయాణించే శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పీసీసీనే అన్ని సౌకర్యాలు చూసుకుంటుందని తెలిపారు. ఢిల్లీ ప్రయాణం సుమారు 30 గంటలకు పైగా ఉండే అవకాశం ఉండటంతో, అత్యధికంగా యువకులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మహేష్ కుమార్ గౌడ్ పిలుపు..
ఈ ప్రయాణ ఏర్పాట్లను సజావుగా పర్యవేక్షించేందుకు ఎంపీ మల్లు రవితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి, ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో ప్రత్యేక కమిటీని నియమించినట్లు వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఢిల్లీ బాట పట్టి తమ నిరసన గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు.
Also Read: కాప్రాలో సైబర్ కేటుగాళ్ల పంజా.. వ్యాపారి ఫోన్ హ్యాక్ చేసి రూ.30 లక్షలు స్వాహా!