Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాతృత్వం చాటుకున్నారు. గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ నేపథ్యంలో తన స్వగ్రామం రహత్ నగర్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రాంతంలో విద్యా సదుపాయాలు మెరుగుపడాలనే లక్ష్యంతో.. టీపీసీసీ చీఫ్ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి 10 ఎకరాలు భూమిని ఇచ్చారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అధిక స్థాయి విద్య, ఆధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
అదే విధంగా గ్రామంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం సబ్‌స్టేషన్ విస్తరణకు.. 1 ఎకరం తన స్వంత భూమిని దానం చేయడం ద్వారా గ్రామ ఉత్పాదకతకు, పరిశ్రమలకు బలాన్ని చేకూర్చే ప్రయత్నం చేశారు.
ధర్మపురి నుంచి బాసర వరకు ప్రతిపాదించిన టెంపుల్ కారిడార్.. రోడ్డు రహత్‌నగర్ గ్రామం మీదుగా వచ్చేలా తన పాత్ర ఉందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం తాను చేసిన సూచనలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
రూ.380 కోట్లతో నిర్మించబోయే ఈ రోడ్డు పూర్తవుతే ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబద్రిగుట్ట, బాసర పుణ్యక్షేత్రాలు ఒకే కారిడార్‌లో కలుస్తాయి. ఇది ప్రాంతీయ పర్యాటకానికి, రహత్‌నగర్ అభివృద్ధికి ఊపునిచ్చే దిశగా ముఖ్యంగా కనిపిస్తోంది. ఈ రహదారి నిర్మాణంతో కరీంనగర్, నిజామాబాద్ మధ్య రహత్‌నగర్ సెంటర్ పాయింట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.
గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న దుర్గాదేవి ఆలయం.. భూమి పూజలో టీపీసీసీ చీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్ గతంలో గ్రామంలో దుర్గాదేవి ఆలయం నిర్మించేందుకు చేసిన సేవలను స్మరించుకున్నారు. సంప్రదాయం, ఆధ్యాత్మికత, గ్రామాభివృద్ధి ఈ మూడు విలువలు తన కుటుంబానికి పునాది అని ఆయన చెప్పారు.
బాల్యం తీపి గుర్తులను ఎప్పటికీ మరిచిపోలేను. తల్లిదండ్రులు చేసిన సేవల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు. గ్రామంతో నా అనుబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుంది. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు.
Also Read: చేనేత కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలి: ఎమ్మెల్సీ కవిత
తరువాత ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.