Malkajgiri Development: స్వేచ్ఛ బ్యూరో: నెలరోజుల క్రితం కొత్తగా ఏర్పడిన మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అభివృద్ది, మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా అత్యవసర, అతి ముఖ్యమైన శానిటేషన్ పనులను గాడీన పెట్టేందుకు, ప్రతి ఇంటి నుంచి నూటికి నూరు శాతం చెత్తను సేకరించేందుకు మైక్రో ప్లానింగ్ ను అమలు చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. కమిషనర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఎల్బీనగర్ జోన్ పరిధిలోని టీకేఆర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తెస్తామని, ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ చిక్కుల నుంచి విముక్తి కల్గుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం నుంచి నగర పరిశుభ్రత వరకు, చిన్నారుల శారీరక ఆరోగ్యం నుంచి పరిపాలన సంస్కరణల వరకు కార్పొరేషన్ చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వివరాలను ఆయన చిట్ చాట్ లో వెల్లడించారు.
మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా టీకేఆర్ (తీగల కృష్ణారెడ్డి) కాలేజీ నుంచి మందమల్లమ్మ జంక్షన్ వరకు నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని కమిషనర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కార్పొరేషన్ పరిధిలో ఒక మైలురాయిగా నిలవనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో విపరీతమైన రద్దీ కారణంగా విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు, నిత్యం ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగం ఇప్పటికే అన్ని సాంకేతిక అనుమతులు పూర్తి చేసిందని, త్వరలోనే భూమి పూజ చేసి పనులను వేగవంతం చేస్తామని ఆయన వివరించారు.
కార్పొరేషన్ పరిధిలో పాలనను పరుగులు పెట్టించటంతో పాటు పౌర సేవలు పారదర్శకంగా అందించేందుకు ప్రజాపాలన -అభివృద్ది ప్రణాళిక 99 యాక్షన్ ప్లాన్ ను రూపొందించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ ప్రణాళిక ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ, మురుగు నీటి పారుదల వంటి అత్యవసర పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని వివరించారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రతి మున్సిపల్ వార్డులో ఈ ప్లాన్ ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు తెల్లవారుఝము నుంచి స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నట్లు, రాబోయే రోజుల్లో ఎంఎంసీలో స్పష్టమైన మార్పును ప్రజలు చూస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Kavya Kalyan Ram: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ‘బలగం’ నటి కావ్య కళ్యాణ్‌రామ్?.. ఎవరితోనంటే?
నగర పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మా ప్రధాన లక్ష్యం వంద శాతం ఇంటింటికీ చెత్త సేకరణలేనని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలో ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా చూడాలనేది మా సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం మైక్రో లెవల్ ప్లానింగ్ సిద్ధం చేశామని, స్వచ్ఛ ఆటోల సంఖ్యను పెంచడంతో పాటు, పారిశుధ్య కార్మికుల పనితీరును జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకు అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుతం తార్నాకలోని హెచ్ఎండీఏ ఆఫీసులో కొనసాగుతున్న ఎంఎంసీ కమిషనర్ కార్యాలయంతో పాటు జోన్, సర్కిల్ ఆఫీసులు కూడా అద్దె భవనాల్లో లేదా తాత్కాలిక వసతుల్లో కొనసాగుతున్న కార్పొరేషన్ కార్యాలయాలకు త్వరలోనే సొంత భవనాలను సమకూర్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, సొంత ఆఫీసు భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే భూముల అన్వేషణను ముమ్మరం చేశామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట అందేలా నూతన కార్పొరేషన్ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం అనువైన ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉండే కేంద్రీకృత ప్రాంతాన్ని త్వరలోనే ఫైనల్ చేస్తామని కూడా తెలిపారు. స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే అత్యాధునిక వసతులతో కూడిన భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామని, తద్వారా పౌర సేవలు మరింత వేగంగా అందించేందుకు వీలు కల్గుతుందని ఆయన వివరించారు.
ప్రస్తుత రోజుల్లో పిల్లలు సెల్‌ఫోన్లకు అడిక్ట్ అయి ఆటపాటలకు దూరం కావటంపై కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులు ఫోన్ లకు బానిసలు కాకుండా, క్రీడల వైపు మొగ్గు చూపేలా కార్పొరేషన్ పరిధిలోని స్పోర్ట్స్ గ్రౌండ్లను తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. విద్యార్థులు, చిన్నారులు వీటిని చూసి క్రీడలు ఆడాలన్న ఆసక్తి కలిగేలా వీటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వివరించారు. చిన్నారులు, విద్యార్థులను డిజిటల్ వ్యసనం నుంచి క్రీడల వైపు మళ్లించేందుకు తాను చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కాప్రా సర్కిల్ లో సుమారు ఎకరం పై చిలుకు స్థలంలో మల్టీపుల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. అన్నిరకాల క్రీడలు ఒకే చోట ఆడేందుకు వీలుగా అందుబాటులో ఉండేలా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను డిజైనింగ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. కేవలం ఆట స్థలాలుగానే కాకుండా, అవి పిల్లల శారీరక, మానసిక వికాసానికి కేంద్రాలుగా ఉండేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఒకే చోట ఎక్కువ మందికి ఉపయోగపడేలా, ఓపెన్ స్పేస్ ఉన్న మైదానాలను గుర్తించి అక్కడ రన్నింగ్ ట్రాక్ లు, జిమ్ పరికరాలు, క్రీడా కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాలనీల్లోని పార్కులను కూడా క్రీడలకు అనుకూలంగా మార్చి, స్థానిక యువతకు, పిల్లలకు అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు. ఎంఎంసీని ఒక ఆదర్శవంతమైన కార్పొరేషన్‌గా మార్చడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని చిట్ చాట్ లో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Also Read: Corporation Chairman: కార్పొరేషన్ చైర్మన్‌లలో టెన్షన్ టెన్షన్..?