Mallareddy: ట్రెండ్‌కు అనుగుణంగా వెళ్లే నేతల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఒకరు. ట్రెండ్‌కు తగ్గట్టుగా మాటలు ఆడుతారు. తనపై మీడియాలో చర్చ జరిగేలా చేస్తారు. చివరకు తాను అలా అనలేదంటూ సెటైర్‌గా చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు అదే చేశారాయన.
తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తుల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఒకరు. పాలు అమ్మిన దగ్గర నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన, వ్యాపారవేత్తగా రాణించారు. ఆ తర్వాత విద్యాసంస్థలను స్థాపించారు. చివరకు రాజకీయ నేతగా మారారు. ఆయన నెక్ట్స్ ఏంటన్నది ఎవరికీ తెలీదు. రాజకీయాలకు దూరంగా ఉంటానని శనివారం చెప్పారు. మరుసటి రోజు ఆదివారం నాటికి మాట మార్చేశారు.
రాజకీయాలకు దూరంగా ఉంటారని అన్నారని, వారసత్వం ఏమైనా కొనసాగిస్తారా? అంటూ మీడియా లేవనెత్తిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. తాను దూరంగా ఉంటానని అనలేదని, స్పీడ్‌లో ఆ విధంగా మెసేజ్ జారి పోయిందన్నారు. ఓ జర్నలిస్ట్ అడిగి ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చానని తెలిపారు.
మీరు టీడీపీలోకి వెళ్తారా? బీజేపీలోకి వెళ్తారా? తాను దేశంలోకి వెళ్లనని చెప్పానని, శనివారం చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదన్నారు. విద్యాసంస్థలను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తానని చెప్పానని తెలిపారు. జపాన్‌లో రిటైర్మెంట్ లేదని, తనకు రిటైర్మెంట్ లేదని చెప్పకనే చెప్పారు మల్లారెడ్డి.
ALSO READ: మళ్లీ ముంచెత్తనున్న భారీ వర్షాలు, ఆగష్టు 14 నుంచి జాగ్రత్త సుమా?
చివరకు తాను రాజకీయాల నుంచి తప్పుకునేది లేదని మనసులోని మాట బయటపెట్టారు మల్లారెడ్డి. ఆ రోజు ఏ పార్టీలో ఉంటానన్నది బయట పెట్టలేదు. బీఆర్ఎస్‌లో కంటిన్యూ అవుతారా? మరో పార్టీ వైపు చూస్తారా? అనేది చెప్పలేదు.
టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలంగాణలో మారిన రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్ వైపు వెళ్లారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశారు. ఆయన కున్న పాత పరిచయాలతో అన్నిపార్టీల అధినేతలతో టచ్‌లో ఉన్నారు. రేపటి రోజున పరిస్థితుల బట్టి మారిపోయే ఛాన్స్ లేకపోలేదు.
గతంలో అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాని వెనుక సారాంశం ఏంటో తెలీదు. కాకపోతే ఆయన టీడీపీలోకి వెళ్తారంటే జోరుగా ప్రచారం సాగింది. బంధువుల పెళ్లి నేపథ్యంలో శుభలేఖ ఇవ్వడానికి వెళ్లానని అన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.
చివరకు మల్లన్న రూటు ఎటు? కంఫర్ట్‌గా ఉందని కారులో కంటిన్యూ అవుతారా? లేక మరేదైనా పార్టీ వైపు చూస్తున్నారా? అనేది ఆయన నోటి వెంట రాలేదు. అప్పుడప్పుడు అలా మీడియా ముందుకొచ్చి తాను ఉన్నానంటూ నేతలకు గుర్తు చేస్తున్నారని అంటున్నారు కొందరు నేతలు.
మల్లారెడ్డి యూటర్న్..
నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని అనలేదు
ఓ జర్నలిస్ట్ అడిగి ప్రశ్నకు సమాధానం ఇచ్చాను అంతే
దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు ఓపెన్ చేస్తానని చెప్పాను తప్ప రాజకీయాలను వదిలేస్తా అని అనలేదు
జపాన్ లో రిటైర్మెంట్ ఉండదు, రాజకీయాల్లోనూ రిటైర్మెంట్ ఉండదు
– మల్లారెడ్డి https://t.co/vQI0I6sTzZ pic.twitter.com/LwmLq25F9i
— BIG TV Breaking News (@bigtvtelugu) August 10, 2025