Retro: తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన తాజా చిత్రం ‘రెట్రో’ కేవలం సినిమా కాదు.. ఒక ఉప్పెన.. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 1, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, తెరపై సూర్య తన విశ్వరూపం చూపించకముందే.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. ‘కంగువా’ వంటి భారీ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో.. సూర్య ఈ ‘రెట్రో’తో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడా అని సినీ విశ్లేషకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా అందాల తార పూజా హెగ్డే నటిస్తుండగా.. రాక్ స్టార్ సంతోష్ నారాయణన్ తనదైన ప్రత్యేకమైన సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేశాయి. ముఖ్యంగా సూర్య కనిపించిన వింటేజ్ గెటప్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దానికి తార్కాణమే ‘రెట్రో’ సాధిస్తున్న అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్.
అడ్వాన్స్ బుకింగ్స్…
తమిళనాడు వ్యాప్తంగా ఏప్రిల్ 27న సాయంత్రం 5 గంటలకు టికెట్ల విక్రయాలు ప్రారంభం కాగానే.. అభిమానులు డిజిటల్ స్క్రీన్ల ముందు క్యూ కట్టారు. కేవలం 24 గంటల్లోనే ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ఏకంగా 83,640 టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం తమిళ్‌లోనే రూ.5కోట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చినట్లు తెలుస్తోంది. సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ వంటి క్రేజీ కాంబినేషన్‌కు తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ ఇదిగో అంటూ ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
భారీ ఓపెనింగ్స్ …
ఇక అంతర్జాతీయ స్థాయిలో ‘రెట్రో’ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. యూకేలో ఈ సినిమా సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది. విడుదల కాకముందే ఒక్క రోజులో 3,200 కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక తమిళ సినిమాకు యూకేలో ఇదే అత్యధిక తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ అని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అహింసా ఎంటర్‌టైన్‌మెంట్, బోలేన్ సినిమాస్ ఘంటాపథంగా చెబుతున్నారు. అంతేకాదు, ఇది సూర్య కెరీర్‌లోనే యూకేలో అత్యంత భారీ ఓపెనింగ్ సాధించే చిత్రంగా నిలవనుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి నిదర్శనంగా బుక్‌మైషోలో ఏకంగా 209,000 మందికి పైగా దీనిపై ఆసక్తి చూపడం ఒక రికార్డు.
విధ్వంసంకు రెడీ ..
‘రెట్రో’ కథాంశం కూడా అంతే ఆసక్తికరంగా ఉండబోతోంది. సూర్య ఈ చిత్రంలో పారివేల్ కన్నన్ అనే ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. తన భార్య రుక్మిణి (పూజా హెగ్డే) కోసం తన రక్తంతో తడిసిన గతం నుండి బయటపడాలని అతను చేసే ప్రయత్నాలు కథ ప్రధానాంశం. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, సంఘర్షణలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. ప్రకాష్ రాజ్, జోజు జార్జ్ , నాజర్ వంటి పవర్ హౌస్ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో.. నటన పరంగా కూడా సినిమా ఉన్నతంగా ఉండబోతోందని భావిస్తున్నారు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ , పాటలు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య , జ్యోతిక సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.