Ganja Chocolates Seized : రాష్ట్రంలో గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై నిఘా పెరిగిన నేపథ్యంలో వరుసగా గంజాయి ముఠాలు పోలీసులకు చిక్కుతున్నాయి. తాజాగా మెడ్చల్ జిల్లా పరధిలోని తూంకుంట ప్రాంతంలోని ఓ వ్యక్తి ఇంట్లో సోధాలు నిర్వహించిన పోలీసులు 85 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు చేస్తున్న రాష్ట్ర డ్రగ్స్ టాస్క్ పోర్స్ సిబ్బంది గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
తూంకుంటలో ఓ పాన్ దుకాణం నడిపిస్తున్న బీహార్ కి చెందిన చున్ చున్ ఉపేందర్ అనే వ్యక్తి.. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పాన్ మసాలాలతో పాటుగా బీహార్ సహా ఇతర ప్రాంతాలకు చెందిన కార్మికులకు ఈ చాకెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో.. అతనిపై నిఘా ఉంచిన యాంటీ నార్కోటిక్ బృందాలు, ఉపేందర్ నివాసంపై దాడులు నిర్వహించాయి.
ఈ సోదాల్లో ఏకంగా 85 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ లోని దర్భంగా ప్రాంతానికి చెందిన ఉపేందర్ జీవనోపాధీ కోసం తూంకుంటకు వచ్చి పాన్ షాప్ నిర్వహిస్తుండగా.. ఆదాయం కోసం ఇలా తప్పుడు మార్గంలో గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడే ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ గుట్టుగా డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ గంజాయి చాక్లెట్లను బీహార్ నుంచి రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. అక్కడ 40 చాక్లెట్ల ఒక్కో ప్యాకెట్ ను.. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ద్వారా నగరానికి చేరవేస్తున్నారు. కాగా.. అక్కడ ఒక్కో ప్యాెకెట్ ను రూ. 25 కి దొరుకుతున్నట్లు తెలిపిన నిందితుడు… ఇక్కడ ఒక్కో చాకెట్ ను రూ. 10 చొప్పున విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఎస్సై పవన్ కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు సత్తార్, వెంకటేశ్వర్ రావు, కానిస్టేబుళ్లు సంజయ్, మునాఫ్ లు కలిసి ఉపేందర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. నిందితుడిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్‌లకు అప్పగించి, కేసులు నమోదు చేశారు.
Also read : టీవీఎస్ ను ఢీకొట్టిన లారీ.. భార్యా, భర్త, కుమార్తె మృతి
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం, రవాణాపై కటినంగా వ్యవహరిస్తున్నాయి. అందులో భాగంగానే.. నగరంలోకి ప్రవేశించే మార్గాలతో పాటు వివిధ చోట్ల నిత్యం సోదాలు నిర్వహిస్తూ అక్రమార్కులకు చెక్ పెడుతున్నారు.