Medchal Diwali Crimes : దీపావళి రోజు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బాలుడిపై కొందరు అమానుషంగా ప్రవర్తించారు. మానసిక స్థితి సరిగా లేని అతని మర్మాంగాల్లో నిందితులు టపాసులు పేల్చి ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలోని బాసరేగడిలో జరిగింది.
బాధితుడి తల్లి తమ కుమారుడిపై జరిగిన దారుణాన్ని యూపీలోని బిషున్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్‌కు చెందిన బాలుడు(16) తన గ్రామానికి చెందిన కొందరితో కలిసి మూడు నెలల క్రితం నగరానికి ఉపాధి కోసం వచ్చాడు. మేడ్చల్ జిల్లాలోని బాసరేగడిలోని కాంక్రీటు ప్లాంటులో ఉద్యోగం చేస్తున్నాడు. దీపావళి రోజున కొందరు దుండగులు అతనితో అసభ్యంగా.. దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఆ తర్వాత అతని మర్మాంగాల్లో టపాసులు పేల్చారు. పేలుడు ధాటికి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ వ్యవహారాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ తర్వాత బాధితుడి ఫోన్ తీసుకున్నారు. గాయపడ్డ బాధితుడు ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్‌లోని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. ఈ వ్యవహారంపై తల్లి ఉత్తరప్రదేశ్‌లోని బిషున్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అక్కడి అధికారులు.. మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి వివరణ కోరగా.. తోటి స్నేహితులే దీనికి కారణమని పేర్కొన్నారు. సరదాగా టపాసులు పేల్చే క్రమంలో ఘటన జరిగిందని వివరించారు. ఘటనపై యూపీ పోలీసుల నుంచి సమాచారం అందిందని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.