తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన మంత్రి.. బీజేపీ నేతలకు తెలంగాణ ఉనికి అంటే మొదటి నుంచీ గిట్టడం లేదని విమర్శించారు.
దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా తెలంగాణ సిద్ధించిందని జూపల్లి గుర్తుచేశారు. భారత రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతో ఏర్పడిన ప్రక్రియను దేశ విభజనతో పోల్చడం ఎంపీ అజ్ఞానానికి నిదర్శనమని తూర్పారబట్టారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారని.. అదే విద్వేష భావజాలాన్ని ఇప్పుడు తేజస్వీ సూర్య కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల బీజేపీ నేతల మనసులో ఉన్న విషం ఈ మాటల ద్వారా బయటపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఒక తల్లి మనసుతో ఈ ప్రాంత బిడ్డల ఆవేదనను అర్థం చేసుకుని ఆమె సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. బీజేపీ నాయకులు కేవలం ఓట్ల కోసమే ఇక్కడ తిరుగుతున్నారని.. వారి అంతరంగంలో మాత్రం తెలంగాణ పట్ల నిరంతరం విద్వేషం నింపుకున్నారని విమర్శించారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న చిన్న రాష్ట్రమైన తెలంగాణను చూసి ఓర్వలేకనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు తెరలేపుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే ఇక్కడి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జూపల్లి డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చరిత్ర తెలియకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి అహంకారపూరిత మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ALSO READ: ఉత్తర తెలంగాణ నుండి గులాబీ యాత్ర.. కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?