Korean Zombie Thriller Series: కరోనా వచ్చి వెళ్ళాక ఇప్పటికీ ఏదైనా కొత్త వైరస్ పేరు వింటేనే వణికిపోతున్నారు జనం. కాస్త జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగులు తీస్తున్నారు. అయినా సరే ఎప్పటికప్పుడు కొత్త కొత్త వైరస్ లు పుట్టుకోస్తూనే ఉన్నాయి. మరి అలాంటి వైరస్ ఒకటి వచ్చి, మనుషుల్ని పిశాచాలుగా మారిస్తే… భయంకరమైన ఈ ఊహను ఓ క్రేజీ కొరియన్ సిరీస్ లో నిజం చేశారు. అదే 2021లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సౌత్ కొరియన్ జోంబీ అపోకలిప్స్, సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘హాప్పినెస్’ (Happiness). కరోనా మహమ్మారి తర్వాత వచ్చిన ఈ సిరీస్ లో జోంబీల భయానికి మించి, మనుషుల మధ్య ఉన్న స్వార్థం, ప్రేమ గురించి ఉంటుంది. మరి ఈ పాపులర్ కొరియన్ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.
కరోనా మహమ్మారి (COVID-19) కథ ముగిసిన తర్వాత, సమాజం సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో ఒక కొత్త ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందుతుంది. ‘నెక్స్ట్’ (Next) అనే ఒక ఫెయిల్యూర్ ఓరల్ డ్రగ్… అంటే టాబ్లెట్ వాడటం వల్ల మనుషులలో ఒక వింత వ్యాధి మొదలవుతుంది. ఈ వైరస్ సోకిన వారు విపరీతమైన దాహంతో రక్తం కోసం పిచ్చివారిలా మారి, పక్కన ఉన్న మనుషులను కొరకడం ప్రారంభిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే జోంబీలుగా మారతారు.
యూన్ సే-బోమ్ అనే అమ్మాయి స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా పని చేస్తుంది. చాలా ధైర్యవంతురాలు, చురుకైన ఈ యువతి మన హీరోయిన్. ఆమె ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ లో ఇల్లు సంపాదించడం కోసం తన క్లాస్‌మేట్ అయిన డిటెక్టివ్ జంగ్ ఇ-హ్యూన్ తో నకిలీ పెళ్లి చేసుకుంటుంది. అతనితోనే ఆ అపార్ట్‌మెంట్‌లోకి అడుగు పెడుతుంది. దురదృష్టవశాత్తూ, వాళ్ళు అక్కడికి వెళ్ళిన కొద్దిరోజులకే ఆ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఈ వింత వైరస్ సోకడం షురూ అవుతుంది.
వైరస్ నగరమంతా వ్యాపించకుండా ఉండటం కోసం మిలిటరీ ఆఫీసర్ హాన్ టే-సియోక్ ఆ అపార్ట్‌మెంట్ ను చుట్టుముట్టి, లోపల ఉన్నవారు బయటకు రాకుండా, బయటివారు లోపలికి వెళ్లకుండా కఠినమైన లాక్‌డౌన్ ను విధిస్తాడు. ఈ సిరీస్ కేవలం జోంబీల చుట్టూ మాత్రమే తిరగదు, అపార్ట్‌మెంట్‌లోని విభిన్న వర్గాల మనుషుల స్వార్థం, క్రూరత్వం చుట్టూ నడుస్తుంది. ఆహారం, నీటి కొరత ఏర్పడిన ఆ భయంకరమైన వాతావరణంలో సే-బోమ్, ఇ-హ్యూన్ ఇద్దరూ కలిసి అక్కడి ప్రజలను ఎలా కాపాడారు ? ఇ-హ్యూన్ చివరి వరకు తన ప్రాణాలను పణంగా పెట్టి సే-బోమ్‌ను ఎలా రక్షించుకున్నాడు ? వైరస్ కు వ్యాక్సిన్ లభించిందా ? అనేది తెరపై చూసి తెలుసుకోవలసిన కథ. ఈ జోంబీ అపోకలిప్స్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ 12 ఎపిసోడ్లు ఉంటుంది. ప్రస్తుతం Amazon MX Playerలో హిందీ, థాయ్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒరిజినల్ కొరియన్ వెర్షన్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: 40 మంది మిస్టీరియస్ మరణాలు… నకిలీ డిగ్రీలు, మెడికల్ ఎగ్జామ్ లీక్స్ తో మెంటలెక్కించే సిరీస్