Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్న నబీన్ వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని, అందుకే ఆయన ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఘాటుగా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తయిన సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
రాంచందర్ రావు మాట్లాడుతూ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ, ఆర్ఆర్ ట్యాక్స్ పై నితిన్ నబీన్ మాట్లాడారని, ఆయన మాట్లాడినవన్నీ వాస్తవాలేనని రేవంత్ కు భయం పట్టుకుందన్నారు. అందుకే నితిన్ ను పట్టుకుని ఆయనెవరో.. ఎందుకు వచ్చారో అని మాట్లాడారన్నారు. నితిన్ నబీన్ తనను తీసేయలేడని మాట్లాడాడని, తానేం మమతా బెనర్జీని కాదని రేవంత్ వ్యాఖ్యానించారన్నారు. వాస్తవానికి నితన్ వచ్చిందే ప్రజల సపోర్ట్ తో రేవంత్ ను తీసేయడానికని రాంచందర్ రావు తెలిపారు. నితిన్ నబీన్ ఒక సామాన్య కార్యకర్త అని, పార్టీ కోసం పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు. గతంలో కూడా కేసీఆర్.. నడ్డాను ఆయనెవరో కూడా తనకు తెలియదని వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందేనని చురకలంటించారు. నితిన్ నబీన్ తెలంగాణాకు వస్తూనే ఉంటాడు.. పోతూనే ఉంటాడన్నారు. గతంలో మోడీని కూడా చాయ్ వాలా ప్రధాని అవుతాడా అని మనీష్ శంకర్ అయ్యర్ ఎద్దేవా చేశారని, ఇప్పుడు అదే చాయ్ వాలా వరుసగా మూడుసార్లు ప్రధాని అయ్యారని గుర్తుచేశారు.
ప్రతీ రోజు ఏదో ఒక కార్యక్రమం
రాజకీయాల్లో సెలవులుండవని, ఈ ఏడాదిలో పార్టీకి సంబంధించి ప్రతీ రోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించినట్లు రాంచందర్ రావు తెలిపారు. తాను రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వెళ్ళానని, ఒక్కో జిల్లాకు 2 లేదా 3 సార్లు వెళ్లినట్లు వివరించారు. తాము చేపట్టిన కార్యక్రమాల వల్ల కొందరు నేతలపై కేసులు కూడా నమోదయ్యాయన్నారు. తెలంగాణలో బీజేపీకి యాక్సెప్టెన్సీ పెరిగిందని, తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో ఫెయిలయిందని మండిపడ్డారు. రైతులకు యూరియా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఎలాంటి కొరత లేదననారు. ఇలాంటి దుష్ప్రచారం కేవలం తెలంగాణలోనే ఉందని, దేశంలో ఎక్కడా లేదన్నారు.
Also Read: వర్షం ఎఫెక్ట్.. ముంబై రైల్వేస్టేషన్లలో భారీ రద్దీ.. మహానగరానికి ‘రెడ్ అలర్ట్’!
కాంగ్రెస్ నేతలపై రాంచందర్ రావు ఫైర్
కాంగ్రెస్ నేతలే.. దాచుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రాంచందర్ రావు మండిపడ్డారు. యూరియా ఉత్పత్తిని నెల పాటు ఆలస్యం చేశారని, ముందే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. స్థానిక కాంగ్రెస్ లీడర్లు ఎరువుల డీలర్లతో కుమ్మక్కై బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వడం కాదని, క్రియేట్ చేయగలగాలని ఆయన వ్యాఖ్యానించారు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎక్కడా ఖాళీలు లేవని, అన్నీ ఫిల్ అయి ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా మన్రేగాలో ఎంతో అవినీతి జరిగిందని, అందుకే ఒక జవాబుదారీతనం కోసం వీబీ జీ రామ్ జీని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నారు. రేవంత్ రెడ్డి.. బాబు మోహన్ లా యాక్ట్ చేయడం మానుకోవాలని రాంచందర్ రావు ఎద్దేవాచేశారు. హామీలిచ్చింది ఆయనయితే.. నెరవేర్చాలని కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని చురకలంటించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 60 మంది
ఎస్ఐఆర్ వల్ల బీజేపీకి ఎలాంటి అడ్వాంటేజ్ లేదని రాంచందర్ రావు వివరించారు. ఇది కేవలం మరణించిన వారు, డబుల్ ఓటర్లను తొలగించే ప్రక్రియ మాత్రమేనని వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 60 శాతం మంది ప్రజలకు ఎన్యుమరేషన్ రోల్స్ ఇచ్చేశారన్నారు. ఎస్ఐఆర్ ఇప్పుడు మొదలైన ప్రక్రియ కాదని, కాంగ్రెస్ హయాంలో కూడా జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఎస్ఐఆర్ వల్ల వారికి అంత ఇబ్బంది ఉంటే కేసు వేయొచ్చు కదా అని సూచించారు. కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ వాళ్ళ దగ్గరే ఉన్నారని గుర్తుచేశారు. అది చేయకుండా లేఖ రాసి ఏం ఉపయోగమని ఫైరయ్యారు. కేసు పెడితే వారి వెర్రితనం బయటపడుతుందని భావించి ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని చురకలంటిచారు. ఇతర దేశస్తులు అక్రమంగా చొచ్చుకు రావడానికి దేశం ఏం సత్రం కాదన్నారు.
శశి థరూర్ విమర్శలు
బీజేపీ సభ్యత్వం ఉంటేనే పౌరసత్వం ఉన్నట్లని అసద్ చెబుతున్నారని, పాస్ పోర్ట్.. సిటిజన్ షిప్(పౌరసత్వం)కు సంబంధించిన డాక్యుమెంట్ కాదని, అది జస్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ అని పేర్కొన్నారు. శశి థరూర్ కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారని, ఆయన అమెండ్ మెంట్ అడిగి తెలుసుకోవచ్చు కదా అంటూ రాంచందర్ రావు అసంతృప్తి వ్యక్తంచేశారు. లీడర్ల పనితీరుపై నితిన్ నబీన్ సంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆయన మూడ్రోజుల పాటు ఇక్కడే మకాం వేశారన్నారు. తెలంగాణపై నితిన్ నబీన్ కు అవగాహన లేదని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారని, వాస్తవానికి మహేష్ కు.. నితిన్ గురించి అవగాహన లేదని చురకలంటించారు. చత్తీస్ గఢ్ లో భూపేష్ బఘేల్ ను గద్దె దించామని, అలాగే.. తెలంగాణలో కూడా రేవంత్ సర్కార్ ను గద్దె దించుతామని ధీమా వ్యక్తంచేశారు. అయోధ్యలో మనీ స్కామ్ జరిగిందని అంటున్నారని, పోప్ దగ్గర కూడా ఇలాంటివి జరిగాయని, ఇలాంటి చిన్న చిన్న విషయాలు అవుతూనే ఉంటాయని, ఎవరో ఒకరు చేసిన తప్పుకు అందరినీ అనడం కరెక్ట్ కాదన్నారు.
Also Read: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్యలు తప్పవు.. పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక
తెలంగాణలోకి అధికారంలోకి వస్తాం
పాలిటిక్స్ లో ఎన్నో చేయాలని చాలామంది అనుకుంటారని, కానీ వారు అనుకున్నవి కొన్నిసార్లు చేయలేరని రాంచందర్ రావు తెలిపారు. తాను కూడా ఏడాది కాలంలో చేసింది తక్కువేనని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ అంశంపై నితిన్ నబీన్ తో ఎలాంటి చర్చ జరగలేదని, దానిపై మోడీ మాత్రమే చెప్పగలడని వెల్లడించారు. ఒక్క వార్డు మెంబర్ కూడా లేని త్రిపురలో మూడుసార్లు గెలిచామని, హర్యానాలో 2 లేదా 3 ఎమ్మెల్యేలు ఉంటే.. అక్కడా గెలుపొందామని, తెలంగాణలో కూడా అలాగే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్.. అని నితిన్ నబీన్ అన్నారని రాంచందర్ రావు గుర్తచేశారు.
రేవంత్ ఫుల్ టైం పొలిటీషియన్ అని తాను ఒప్పుకుంటానని, కానీ రాహుల్ గాంధీ ఆయనతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ గెలిచిన ప్రతిచోటా తనవల్లే గెలిచినట్లు రేవంత్ చెబుతున్నారని పేర్కొన్నారు. బీజేపీలో ఇతర పార్టీల నుంచి చేరేందుకు చాలామంది క్యూలో ఉన్నారని రాంచందర్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో చాలామంది నాయకులు చేరుతామని వచ్చారన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బెంగాల్ కంటే మించి తెలంగాణలో చేస్తామని స్పష్టంచేశారు. తమ పార్టీలో పాత, కొత్త అనేది లేదని, అదంతా ఎవరో క్రియేట్ చేశారని రాంచందర్ రావు కొట్టిపారేశారు.
రాంచందర్ రావుకు నితిన్ నబీన్ ఫోన్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.., తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు బుధవారం ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో జూన్ 28, 29, 30 తేదీల్లో మూడ్రోజుల పాటు నితిన్ నబీన్ పర్యటించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు వచ్చిన ఆయన తెలంగాణ టూర్ విజయవంతం కావడంతో పాటు రాంచందర్ రావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఏడాది కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడంపై అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఒకేడాది కాలంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, కేడర్‌లో నూతన ఉత్సాహం నింపడానికి రాంచందర్ రావు చేసిన కృషిని జాతీయ అధ్యక్షుడు కొనియాడారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.