Komatireddy Venkat Reddy On KCR(Telangana politics): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలు తాగేందుకు నీళ్లు లేక మూసీ నీరు తాగుతుంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఉత్తర తెలంగాణ కోసం అవసరం లేకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో రూ.300 కోట్లు ఖర్చుపెట్టి కేవలం ఒకే ఒక్క సీటు గెలిచిందన్నారు. తాము ఒకవేళ సూర్యాపేట నియోజకవర్గంలో ప్రచారం చేసుంటే జగదీశ్ రెడ్డి 70 వేల ఓట్లతో ఓటమి చవిచూసేవారన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని కోమటిరెడ్డి తెలిపారు. ఆయనకు ఎప్పుడూ ఎక్కడ దోచుకుందామా అనే ఆలోచనలే ఉంటాయన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. కీలక శాఖలన్నీ తన వద్దే పెట్టుకొని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్‌ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణనే కేసీఆర్ దోపిడీకి ఉదాహరణ అని అన్నారు. వందల కోట్ల అక్రమ సంపాదనతో శివబాలకృష్ణ దొరికాడని పేర్కొన్నారు.
ఇక మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కి ఐదు వేల ఎకరాలున్నాయని, ఆయన బండారం కూడా త్వరలోనే బయటపడుతుందని మంత్రి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అడ్డంగా దోచుకొని ఇప్పుడు పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఇంకా ప్రైవేటు విమానం లీజ్ క్యాన్సిల్ చేసుకోలేదని.. దుబాయ్ పారిపోవచ్చనే లీజును కొనసాగిస్తురేమో అని అన్నారు. అన్ని విషయాలు అసెంబ్లీలో బయటపడతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.