Hydeabad: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఎప్పుడు, ఎలా ఉంటాయో ఊహించలేరు. క్షణానికో మలుపు తిరుగుతాయి. పరకాల వివాదం ఓ రేంజ్‌కి చేరింది. రేపోమాపో కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయవచ్చన్న వార్తల వేళ ఊహించని ట్విస్ట్ నెలకొంది. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి కొండా సురేఖ వచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ మహిళాలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి పలువురు మంత్రులు వచ్చారు. ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. అలా రాఖీలు కట్టినవారిలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పలువురు మహిళా నేతలు ఉన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆయనకు రాఖీలు కట్టారు మహిళా మంత్రులు. సీఎంతో పాటు ఇద్దరు మంత్రులు స్వీట్లు తినిపించుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పారు. మంత్రి కొండా సురేఖతో సీఎం రేవంత్, ప్రత్యేకంగా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇరువురు మధ్య ఏం జరిగిందనేది టాప్ సీక్రెట్. కాకపోతే నేతల మధ్య రాజీ కుదిరిందంటూ మీడియాలో ప్రచారం జోరందుకుంది.
కొద్దిసేపు తాజా రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పుల ప్రచారం జోరందుకున్న వేళ సీఎం రేవంత్‌ను కొండా సురేఖ కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి ఇక్కడితో ఎండ కార్డు పడుతుందా? కొండా సురేఖపై అధిష్ఠానం చర్యలు చేపడుతుందా? అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.
పరకాల వ్యవహారంతో అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారంటూ ఊహాగానాలు జోరందుకున్న వేళ శుక్రవారం సీఎం రేవంత్ ఇంటికి రావడం, రాఖీ కట్టడం నేతల్లో ఆసక్తిని పెంచింది. సురేఖ కుమార్తె సుష్మిత పటేల్.. సీఎం టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
ALSO READ: తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ సేవలు.. ప్రయాణికులు ఫోన్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు
జరిగిన పరిణామాలపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసిందని, కొండాను మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమంటూ వార్తలు వచ్చాయి. తాము కాంగ్రెస్ పార్టీని విడిచేది లేదని మురళి కూడా స్వయంగా చెప్పారు. ఈ క్రమంలో కొండా దంపతులు సొంత దారి చూసుకుంటారని చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.