KTR Invitation: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. హర్యానాలోని ప్రముఖ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి విచ్చేసి విద్యార్థులు, అధ్యాపకులతో సంభాషించడంతో పాటు వారిని ఉద్దేశించి ‘డిస్టింగ్విష్డ్ పబ్లిక్ లెక్చర్’ ఇవ్వాలని యూనివర్సిటీ కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సి.రాజ్ కుమార్ ప్రత్యేకంగా లేఖ రాశారు.
కేటీఆర్ ఆలోచనలు, ప్రసంగం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తాయని లేఖలో వైస్ చాన్స్ లర్ పేర్కొన్నారు. కేటీఆర్‌కు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి సెప్టెంబర్, అక్టోబర్ లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భారత్‌లోనే తొలి రాజ్యాంగ మ్యూజియం, రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అకాడమీని సందర్శించాలని కూడా కేటీఆర్‌ను ఆహ్వానించారు. భారత రాజ్యాంగం ఆమోదానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ రాజ్యాంగ మ్యూజియంలో రాజ్యాంగ నిర్మాణ సమయంలో ఎదురైన పోరాటాలు, సవాళ్లు, రాజ్యాంగ నిర్మాతల కృషిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
Also Read: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ, కన్నతల్లి హత్య.. మైనర్ల క్రూరత్వానికి బాధ్యులెవరు?
2009లో స్థాపించిన ఓ.పీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రస్తుతం దేశంలోని ప్రముఖ బహుళ విభాగాల, పరిశోధనాధారిత విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ 16 వేల మందికిపైగా విద్యార్థులు, 1,100 మందికిపైగా పూర్తిస్థాయి అధ్యాపకులు ఉన్నారు. 50కి పైగా దేశాలకు చెందిన అధ్యాపకులు, 160 దేశాలకు చెందిన విద్యార్థులతో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ విశ్వవిద్యాలయం, ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లోని 600కుపైగా ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కలిగి ఉంది. మరోవైపు యూనివర్సిటీ విద్యార్థులతో పాటు అధ్యాపకులతో సంభాషించేందుకు ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. విద్యార్థులతో సంభాషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కచ్చితంగా యూనివర్సిటీ పంపిన ఆహ్వానం మేరకు హాజరు అవుతానని తెలిపారు.
Also Read: లాంగ్ రైడర్లకు అదిరిపోయే బైక్.. కవాసకి వెర్సిస్ 650 కొత్త వెర్షన్ వచ్చేసింది!