Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు పొంగులేటి హర్ష రెడ్డి, ప్రభుత్వ భూములను కబ్జా చేశారంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్థలంలో అతివేగంగా కంచెలు ఏర్పాటు చేశారని, మార్చి-ఏప్రిల్ 2026 నాటికి అక్కడ భారీ మార్పులు చోటుచేసుకున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ మంత్రి కుటుంబమే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు.
నాదుర్ గుల్ భూములకు సంబంధించిన సర్వే నంబర్ 613లో ఉన్న 373.22 ఎకరాలు 2004 నుండి ప్రభుత్వ భూమిగానే ఉందని, దీనిపై అనేక కోర్టులలో పోరాటం సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. “01.09.2014లో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది. 2016లో ముటేషన్ చేసింది మీ ప్రభుత్వం కాదా?” అని బీఆర్ఎస్ నేతలను మంత్రి నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలోనే 2021లో పనులు ప్రారంభమై, 2022 నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయని, రోడ్లు వేసి రంగులు వేసింది కూడా గత పాలకులేనని గుర్తు చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న ‘డ్రామాల రావు’, ‘అబద్ధాల రావు’ దీనికి సమాధానం చెప్పాలని ఎద్దేవా చేశారు. 2022లో సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు కనీసం కౌంటర్ వేయని బీఆర్ఎస్, ఇప్పుడు బురద చల్లడం హాస్యాస్పదమన్నారు.
నాదుర్ గుల్ భూముల డెవలప్‌మెంట్ చేస్తున్న కంపెనీలతో తన కుమారుడు హర్ష రెడ్డికి గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి సంబంధం లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. వట్టినాగులపల్లి భూములు షా కుటుంబానికి చెందినవని, ఆ భూమిని డెవలప్‌మెంట్ చేయడానికి తీసుకున్న కంపెనీలో మాత్రమే తన కుమారుడు పార్ట్‌నర్ అని వివరించారు. ఈ భూములపై కోర్టు నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, సుప్రీంకోర్టు ఆదేశానుసారం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజకీయ స్వార్థం కోసమే షా కుటుంబ సభ్యుల వివాదాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు.
రాఘవ కన్‌స్ట్రక్షన్స్, తిరుమల మెటల్ ఇండస్ట్రీ మధ్య ఉన్న సంబంధంపై వస్తున్న వార్తలను మంత్రి కొట్టిపారేశారు. తిరుమల ఇండస్ట్రీ కేవలం మెటల్ సప్లై చేసే సంస్థ అని, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఆ సంస్థ నుండి మెటల్ కొనుగోలు చేసిందని తెలిపారు. బుద్వేల్‌లో తిరుమల ఇండస్ట్రీ రాళ్లను క్రష్ చేస్తే, వాటిని రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కొనుగోలు చేసిందని, ఇది సాధారణ వ్యాపార లావాదేవీ మాత్రమేనని వివరించారు. వీటికి సంబంధించి జీఎస్‌టీ, కరెంట్ బిల్లులు కూడా సక్రమంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడటంలో రాజీ పడదని, సర్వే 613 విషయంలో కోర్టులో గట్టిగా పోరాడుతున్నామని మంత్రి భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే తన కుటుంబంపై విష ప్రచారం చేస్తున్నారని, కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
Read Also: ఇన్నాళ్లకు మేలుకొన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం