Ponnam Prabhakar: గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలుస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్చడం ద్వారా ఆ పథకం ఆత్మను చంపే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ముమ్మాటికీ పేదల పొట్టకొట్టడమేనని, ఆయన కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఉరితాడు బిగిస్తోందని మంత్రి పొన్నం ఆరోపించారు. మహాత్మా గాంధీ పేరును పథకం నుంచి తొలగించడం ద్వారా బీజేపీ నేతలు గాంధీని మరోసారి అవమానపరిచారని, తాము గాడ్సే వారసులమని నిరూపించుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిఖిల్ డే, అరుణ రాయ్, ప్రొఫెసర్ హరగోపాల్, శాంత సిన్హా వంటి మేధావులతో చర్చించి, వారి సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని రూపొందించిందని గుర్తుచేశారు. ఇది కాంగ్రెస్ ‘బ్రెయిన్ చైల్డ్’ కాబట్టే.. రాజకీయ కక్షతో దీనిని అంతం చేయాలని మోదీ సర్కార్ చూస్తోందని విమర్శించారు. కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలను ఆదుకున్నది ఈ పథకమేనని ఆయన స్పష్టం చేశారు.
ఉపాధి హామీ చట్టంలో కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలు నిజంగా గొప్పవే అయితే.. రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు చర్చించడం లేదని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా, పార్లమెంట్‌లో హడావిడిగా బిల్లులు ప్రవేశపెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని, ఇప్పటికే జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్ ల పేరుతో పన్నులు వసూలు చేస్తూ, రాష్ట్రాలకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం తన సొంత అవసరాలకు వాడుకుంటోందని ఆరోపించారు. ఇప్పుడు ఉపాధి హామీ నిధుల్లో కోతలు విధిస్తూ.. 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమని అన్నారు.
పట్టణ ప్రాంతాల్లోనూ పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉపాధి హామీని విస్తరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు ఉన్న పథకాన్నే లేకుండా చేస్తోందని విమర్శించారు. ఈ ప్రజావ్యతిరేక బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రం పేరు మార్చినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి మహాత్మా గాంధీ పేరుతోనే ఈ పథకాన్ని కొనసాగిస్తామని, పట్టణ ప్రాంతాలకు కూడా దీనిని విస్తరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Read Also: Konda Surekha: మమ్మల్ని ఎదుర్కోలేక మా వెనుక గోతులు.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్