Minister Seethakka: బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు ఆవేశమెక్కువ.. ఆలోచన తక్కువంటూ మంత్రి సీతక్క విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా కేటీఆర్ చేస్తున్న విమర్శలపై సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు జరుగుతున్న మేలు ఓర్వలేక.. కేటీఆర్ ఈ తరహా విష ప్రచారాలు సాగిస్తున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మూడు బృహత్తర కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా లబ్దిదారుల జాబితాను అధికారులు చదివి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి వద్ద దరఖాస్తులను స్వీకరించారు. అయితే అర్హత ఉన్న ఏ ఒక్కరికైనా పథకాలతో లబ్ది చేకూరకపోతే, సీరియస్ యాక్షన్ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అనవసర రాద్దాంతం చేస్తుందని కాంగ్రెస్ వాదిస్తోంది. కేటీఆర్ మరికాస్త ముందుకు అడుగేసి, పథకాలు రాని గ్రామాలు రణరంగంగా మారుతాయని ప్రకటించారు.
ఈ కామెంట్స్ పై సీతక్క సీరియస్ అయ్యారు. సీతక్క మాట్లాడుతూ.. నూతన పథకాలతో గ్రామాల్లో పండగ వాతావరణం కన్పిస్తుంటే కేటీఆర్ ఓర్వ లేకపోతున్నారని విమర్శించారు. కొత్త పథకాలను కేవలం ఒక్క గ్రామానికే పరిమితం చేసినట్లుగా కేటీఆర్ భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి మండలంలో ఒక గ్రామంలో నాలుగు నూతన పథకాలను విజయవంతంగా ప్రారంభిస్తే కేటీఆర్ తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. ఒక గ్రామంలో పథకాల అమలును లాంఛనంగా మొదలు పెట్టి, ఇతర గ్రామాలకు విస్తరిస్తారన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలు అర్హులందరికి అందడం లేదా అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చ గొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే కేటీఆర్ పని అని మండిపడ్డారు. కేటీఆర్ కు ఆవేశమెక్కువ.. ఆలోచన తక్కువ అని ఎద్దేవా చేసారు. బీఆర్ఎస్ లాగా ఎన్నికల లబ్ది కోసం తాము పథకాలు అమలు చేయడం లేదన్న విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు.
Also Read: CM Chandrababu: అప్పు అడిగితే.. పారిపోతున్నారు.. సీఎం చంద్రబాబు
దళిత గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి, అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు, మైనారిటీలకు మైనారిటి బంధు హమీని ఎంత మేర నెరవేర్చారని ప్రశ్నించారు. గత సీఎం కేవలం చింతమడకకే సీఎం అయినట్లు వ్యవహరించి.. ప్రతి ఇంటికి పది లక్షలు పంచి పెట్టారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. గత పదేండ్లలో పేదల గృహనిర్మాణాన్ని విస్మరించి, కొత్త రేషన్ కార్డులను ఇవ్వని మీరు ఇప్పుడు మాయమాటలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.