Minister Sridharbabu Serious on BRS Over Musi River Development: మూసీ ప్రక్షాళన విషయమై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల తీరును తప్పుబట్టారు.
‘మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ను తెచ్చిందే బీఆర్ఎస్ సర్కారు. మూసీలో అక్రమ కట్టడాలను గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా?. మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా? గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులను మరిచిపోయినట్లున్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం.
Also Read: 2025లో ‘హైడ్రా’బాద్ ఎవరిది ? మేయర్ పీఠం మీద కూర్చునేదెవరు ?
2021లో మూసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం సమావేశాలు నిర్వహించింది. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ ను నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బీఆర్ఎస్ హయాంలోనే మూసీ సరిహద్దులను ఫిక్స్ చేశారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. విశ్వనగరం అనే పేరులోనే కాక కార్యాచరణ చేపట్టాలని మా ప్రభుత్వం ఆలోచిస్తుంది’ అంటూ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
“పేద, మధ్య తరగతి కుటుంబ అవసరాలు తెలుసుకుని అవి తీర్చడానికే ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ ఆరోపణలు తగదు. అసలు, బీఆర్ఎస్ హయాంలోనే మూసీ రివర్ డెవలప్మెంట్ పేరుతో 2017లో జీవో నెంబర్ 90 ద్వారా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాలు లెక్క తీయాలని, రివర్ బెడ్ బఫర్ జోన్ ఫిక్స్ చేయాలని అందులోనే స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘అప్పటి మీటింగ్ మినిట్స్‌లో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. అక్రమ కట్టడాలు ఎలా తొలగించాలో 2020 జూన్ 27న అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ మీటింగ్ ఏర్పాటు చేసి మరీ మాస్టర్ ప్లాన్‌పై చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. పరివాహక ప్రాంత ప్రజలకు సుమారు 15వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. బఫర్, ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేసి అక్రమ కట్టడాలు కూల్చేయాలని కూడా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ ఎంఎస్ 7 ద్వారా 50 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా గుర్తించాలని 2016లోనే వారు చెప్పారు.
Also Read: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ
బీఆర్ఎస్ ఆలోచన చేస్తే మంచి కార్యక్రమమవుతుంది.. మేము చేస్తే మాత్రం అది చెడు అయిపోతుందా?. హైదరాబాద్ విశ్వనగరం అనేది పేరుకేనా?, ప్రభుత్వం మంచి చేస్తుంటే బీఆర్ఎస్ బురద ఎందుకు జల్లుతోంది?. మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా?. ‘‘మీరు మంచి సూచనలు, సలహాలు చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా స్వీకరిస్తుంది. కానీ, రాజకీయం చేస్తూ సమస్యను జఠిలం చేయడం సరికాదు. కాళేశ్వరం, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో అప్పుడు మీరు ఎందుకు మానవత్వం చూపెట్టలేదు. ఇప్పటికైనా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు.. అందుకు చాలా సంతోషం. డబ్బులు ఖర్చు పెట్టి ప్రజా ఉద్యమాలు చేస్తామని చెప్పాలి కానీ, ప్రభుత్వం పై వ్యతిరేక కార్యక్రమాలు చేస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్?” అంటూ మంత్రి ఫైరయ్యారు.