Big Stories

Uttam Kumar Reddy: మేడిగడ్డను సందర్శిస్తా.. అన్ని ప్రాజెక్టులపై సమీక్ష చేస్తా.. లెక్కలు తీయండి..

Uttam Kumar Reddy : మేడిగడ్డ బ్యారెజ్‌ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని తెెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ సందర్శన సమయంలో ప్రాజెక్టును నిర్మించిన ఏజెన్సీ, అధికారులు తన వెంట ఉండాలని స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జలసౌధలో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సమీక్ష చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం చాలా తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ జరిగిన ఘటనకు బాధ్యత వహించాల్సిందేనన్నారు.

- Advertisement -

బ్యారేజీ పిల్లర్ కుంగిన ఘటనను మంత్రికి అధికారులు వివరించారు. ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగిందని తెలిపారు. మరో మూడు పిల్లర్లపైనా ఈ ప్రభావం పడిందని చెప్పారు. మొత్తం నాల్గవ పిల్లర్ పై ఎఫెక్ట్ పడిందని చెప్పారు. పిల్లర్‌ కుంగిన వెంటనే ప్రాజెక్టులో నీటిని తోడేశామని అధికారులు వివరించారు. ఆ తర్వాత కుంగడం తగ్గిందని వివరించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.4,600 కోట్లు ఖర్చు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధికారులు వివరించారు.

- Advertisement -

నీటి పారుదల శాఖలో పెండింగ్‌ ప్రాజెక్టులు పరిస్థితిపై మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సమీక్షించారు. ప్రాజెక్టుల గురించి మంత్రికి ఈఎన్‌సీ మురళీధర్‌రావు వివరించారు.

రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు నామమాత్రంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల పురోగతిపై ఆరా తీశానన్నారు. బిల్లులు బకాయి ఉన్నాయని తెలిసిందన్నారు. రాష్ట్రంలోని 40 వేల చెరువులపై శ్రద్ధపెడుతున్నామని చెప్పారు.

వచ్చేవారం నుంచి ప్రతి ప్రాజెక్టుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు వివరాలను సిద్ధం చేయాలని అధికారులకు నిర్దేశించారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ప్రాజెక్టులు ఏవిధంగా నిర్మిస్తారు? నిధులు ఎలా సమీకరించారు? అని నిలదీశారు. ప్రాజెక్టులకు థర్డ్ పార్టీ చెకింగ్ లేదా? కాళేశ్వరం నిర్మాణానికి సీడబ్ల్యూసీ అనుమతి ఉందా? పాత ఆయకట్టును ఎందుకు కొత్త ఆయకట్టులో కలుపుతున్నారు? అని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ అవినీతికి తావు లేకుండా పారదర్శంగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News