MLA Rajasingh: జిల్లా అధ్యక్షుల ఎంపిక తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిందా? సీనియర్ నేతలు నిరసన రాగాలు వినిపిస్తున్నారా? ఈ జాబితాలో ఒకొక్కరుగా బయటకు వస్తున్నారా? పార్టీ సీనియర్, ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయా? రేపో మాపో ఆయన బాటలో మరికొందరు నడవబోతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
పార్టీలో చిచ్చు?
తెలంగాణా బీజేపీ నేతల్లో కీలకమైన రాజాసింగ్ ఒకరు. చెప్పాల్సింది ఆయన ఏదైనా సూటిగా చెప్పేస్తారు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. మనసులోని భావాలను అప్పుడప్పుడు బయటపెడతారు. పార్టీ పరంగా, ఆయనకు చిక్కులు ఎదురైన సందర్భాలు లేకపోలేదు. మళ్లీ వార్తల్లోకి వచ్చేశారాయన. పార్టీలో జరుగుతున్న లుకలుకలపై నోరు విప్పారు.. మొత్తమంతా బయటపెట్టేశారు. దీంతో బీజేపీలో ఏం జరుగుతోందన్న అప్పుడే మొదలైంది.
తెలంగాణాలో జిల్లా అధ్యక్షుల పోస్టులను భర్తీ చేస్తోంది ఆ రాష్ట్ర యూనిట్. ఇప్పటికే కొందర్ని పార్టీ నియమించింది. మరికొందరి ఎంపికపై తీవ్రంగా కసరత్తు జరుగుతోంది. నల్గొండ అధ్యక్షుడి ఎంపికపై కొందరు నేతలు ఆందోళనలు చేస్తున్నారు. చాలా జిల్లాల్లో బీజేపీ అధ్యక్షుల ఎంపికపై కొందరు సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాకపోతే అందరూ సైలెంట్‌గా వుంటున్నారు.
ఏం జరిగింది?
లేటెస్ట్‌గా గొల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి వ్యవహారం దుమారం మొదలైంది. ఆ పదవిని ఎస్సీ లేదా బీసీ వర్గానికి చెందిన నేతలకు ఇవ్వాలని తాను సూచించినట్టు ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఎంఐఎంతో కలిసి తిరిగేవారికి ఆ పదవి ఇవ్వడంపై మండిపడ్డారు. ఆవేశంతో రగిలిపోయిన ఆయన కీలక నేతలకు ఫోన్ చేసి దీనిపై ప్రశ్నించారు. ఆ విషయం తమకు తెలీదని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలతో యుద్ధం సాగిస్తూ వచ్చానన్నారు. ఇప్పుడు సొంత పార్టీతో యుద్ధం చేయాల్సిరావడం దురదృష్టకరమన్నారు. జిల్లా అధ్యక్ష పదవి అనేది ఎమ్మెల్యే లేదా ఎంపీ సూచించిన వ్యక్తికి ప్రతీ చోటా ఇవ్వడం జరుగుతోందన్నారు. పార్టీలో తన సూచనలను ఎందుకు పక్కన పెట్టారన్న దానిపై రుసరుసలాడారు.
జీవితంలో ఎప్పటివరకు ధర్మ ప్రచారం చేస్తున్నారని, బ్రోకరిజం తాను నేర్చుకోలేద న్నారు. అలాంటి కొందరి వల్లే పార్టీ వెనుకబడిందని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సిందని, రిటైరైన వ్యక్తుల వల్ల బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదని కుండబద్దలు కొట్టేశారు. సింపుల్‌గా చెప్పాలంటే పార్టీలో చేరిన నుంచి వేధింపులు భరిస్తున్నారని, ఇక తట్టుకోలేకపోతున్నారని తెలిపారు.
పొమ్మనకుండా పొగపెట్టడమంటే ఇదేనేమో అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు సదరు ఎమ్మల్యే. పార్టీకి తన సేవలు అవసరం లేదు.. వెళ్లిపో అని చెబితే బయటకు వెళ్లేందుకు రెడీ ఉన్నానంటూ హింట్ ఇచ్చేశారు. ఆయన వ్యాఖ్యలపై పార్టీలో దుమారం మొదలైంది. రేపో మాపో కొందరు అసంతృప్తులు నోరు విప్పే అవకాశముందని అంటున్నారు.
ఎవరీ రాజాసింగ్?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. 2014లో తొలిసారి అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారాయన. 2018 బీఆర్ఎస్ వేవ్‌లోనూ గెలిచారు.2014, 2018, 2023లో అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజాసింగ్ అంటే గోషామహల్ అనే విధంగా తన స్థానాన్ని అక్కడ పదిలం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ఆ తర్వాత ఆయనపై పార్టీ వేటు వేసింది. ఎన్నికలకు ముందు ఆయనపై నిషేధం పార్టీ ఎత్తివేసిన విషయం తెల్సిందే.