తనకు మంత్రి పదవి కంటే మాలల అభివృద్ధే ముఖ్యమని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాకా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవిపై హామీ లభించిందని స్పష్టం చేశారు. కానీ తనకు మాత్రం మాలల అభివృద్ధి, హక్కులు ముఖ్యమని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ లోని పరేడ్ మైదానంలో మాలల భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు.
ఈ సభకు అందరూ రావాలని, మాలల ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు. దళితుల్లో ఉపకులాలు ఎక్కువగా ఉన్నాయని, వారందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతే కాకుండా ప్రైవేటు ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ఆసక్తికరంగా మారింది. గత కొద్ది రోజులుగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కని కారణంతో ఈ జిల్లాలో ఒకరికి మంత్రి పదవి వస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లోనే కాకా వారసులు వినోద్, వివేక్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉంటే, వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు వివేక్ కుమారుడు వంశీ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. వివేక్ కు ఎమ్మెల్యే టికెట్, వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారు. వంశీకి ఇచ్చిన టికెట్ ను తన పెదనాన వినోద్ కూతురు కోసం సైతం అడిగారట. కానీ ఆ టికెట్ అధిష్టానం వంశీకి కేటాయించడంతో మంత్రి పదవి వినోద్ కు ఇవ్వాలని నిర్ణయించారట. కాబట్టి మంత్రి పదవి వినోద్ కే దక్కుతుందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.