అల్లుడి గిల్లుడు.. ఇరకాటంలో మామ
కేసీఆర్, కేటీఆర్‌లకు హరిశ్‌రావు వ్యాఖ్యల తలనొప్పి
మొన్న ఓఆర్ఆర్ దర్యాప్తుకు రెడీ అంటూ వ్యాఖ్యలు
ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
నిన్న కేసీఆర్‌కు ఈ సభలో గౌరవం లేదని ప్రకటన
అప్పటివరకూ సభకు హాజరుకారనే పరోక్ష సంకేతం
ఈ రెండు అంశాల్లోనూ చిక్కుల్లో పడిన సొంత పార్టీ
ఆ వ్యాఖ్యల వెనక ఉద్దేశంపై గులాబీ నేతల్లో చర్చలు
హరీశ్‌రావు వ్యక్తిగతమా?, కేసీఆర్ చెప్పించారా?
ఎమ్మెల్యేల మధ్య వినిపిస్తున్న గుసగుసలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ :
Harish Rao – KCR: అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల మధ్య చర్చకు దారితీశాయి. ప్రభుత్వాన్ని విమర్శించే సమయంలో ప్రస్తావించిన అంశాలు పార్టీకి తలనొప్పిగా మారాయన్నది ఆ పార్టీ నేతల ఆవేదన. అటు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఇరుకున పెట్టేలా హరీశ్ వ్యాఖ్యలు మారాయని నాయకులు భావిస్తున్నారు. గత సమావేశాల సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహారంలో ప్రభుత్వాన్ని సవాలు చేసే తీరులో ప్రకటన చేశారు.
టెండర్ ఒప్పందాన్ని రద్దు చేయవచ్చంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి… హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌కు సంతాపం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఈ సభ కేసీఆర్‌కు గౌరవం ఇవ్వడంలేదు.. అందుకే ఆయన రావటంలేదంటూ కామెంట్ చేశారు. అసలు సభకు వస్తేగదా… ఆయనకు గౌరవం ఇచ్చిందీ… లేనిదీ.. తెలిసేది… అంటూ ఎమ్మెల్యేల నుంచి సెటైర్లు వినిపించాయి. కేసీఆర్‌కు గౌరవం దక్కేంత వరకు సభకు రారంటూ హరీశ్‌రావు పరోక్షంగా సంకేతం ఇచ్చినట్లయింది. ఈ రెండు సందర్భాల్లోనూ బీఆర్ఎస్‌ను హరీశ్‌రావు ఇరుకున పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఔటర్ రింగు రోడ్డును మహారాష్ట్రకు చెందిన ఐఆర్‌బీ అనే సంస్థకు 30 ఏండ్ల పాటు లీజుకు ఇవ్వడాన్ని పీసీసీ చీఫ్ హోదాలో అప్పట్లోనే రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. అతి తక్కువ ధరకు లీజుకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని ఆరోపించారు. లీజు ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలని అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్యుమెంట్లను ఇవ్వకపోవడంతో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. చివరకు హైకోర్టును ఆశ్రయించారు.
బీజేపీకి చెందిన రఘునందన్‌రావు సైతం లీజు ఒప్పందాన్ని తప్పు పట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఇతర అంశాలపై చర్చ జరుగుతున్న సందర్భంగా హరీశ్‌రావు ఓఆర్ఆర్ లీజు ఒప్పందంలో ఎలాంటి అవినీతి, లోపాలు లేవని అన్నారు. దమ్ముంటే ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చని సవాలు విసిరారు. స్వయంగా హరీశ్‌రావే కోరుతున్నందున ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నాం అంటూ సభా వేదికగా ప్రకటన చేశారు.
ఓఆర్ఆర్ లీజుతో కేటీఆర్ బద్నాం
ఓఆర్ఆర్ లీజు ఒప్పందం పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరగడంతో అప్పట్లో ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఇరుకున పడ్డట్లయింది. ఇంకా సిట్ తన దర్యాప్తును మొదలుపెట్టలేదు. కేటీఆర్‌ను చిక్కుల్లో పడేయడానికి హరీశ్‌రావు చేసిన కామెంటే కారణమన్న చర్చ అప్పట్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య జరిగింది. ఆవేశంలో భాగంగా హరీశ్‌రావు ఈ అంశాన్ని ప్రస్తావించారా?… లేక ఇంకేమైనా కారణం ఉన్నదా?… అనే గుసగుసలూ వినిపించాయి.
హరీశ్‌రావు కామెంట్లపై కేటీఆర్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం పాటించారు. సిట్ తన దర్యాప్తును మొదలుపెడితే హరీశ్‌రావుకు వచ్చే నష్టమేమీ లేకపోయినా కేటీఆర్ మాత్రం అప్పట్లో మంత్రిగా తీసుకున్న విధాన నిర్ణయంపై వివరణ ఇవ్వక తప్పదనేది గులాబీ ఎమ్మెల్యేల భావన. ఈ లీజు ఒప్పందం కుదిరిన తర్వాతనే బీఆర్ఎస్‌కు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్ రూపంలో విరాళం అందింది. సిట్ దర్యాప్తు మొదలైతే మంత్రి ప్రమేయం, ఆదేశాలు, ఒప్పందంలోని వివరాలు, మంత్రివర్గానికి పంపిన నోట్ ఫైల్, లభించిన ఆమోదం తదితరాలన్నీ వెలుగులోకి వస్తాయి.
కేసీఆర్‌కు ఈ సభలో గౌరవం లేదు
ఈ సభ కేసీఆర్‌కు ఏం గౌరవం ఇచ్చిందని ఆయన సభకు రావాలి… అంటూ హరీశ్‌రావు మూడు రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా కామెంట్ చేశారు. ఆయనకు గౌరవం దక్కేంతవరకూ సభకు రారేమో… అంటూ వెంటనే ఎమ్మెల్యేల మధ్య గుసగుసలు వినిపించాయి. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరై సంతకం చేయడం ఒక నిబంధన. సంతకం చేయడానికి అసెంబ్లీకి వచ్చే కేసీఆర్ సభా కార్యక్రమాల్లో పాల్గొంటారో… లేదో.. అనే చర్చలు జరుగుతున్న సమయంలో గౌరవం అంశాన్ని కేసీఆర్‌కు అంటగడుతూ హరీశ్‌రావు వ్యాఖ్యానించడం సరికొత్త చర్చకు తావిచ్చినట్లయింది.
Also Read: South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన మీకోసమే!
కేసీఆర్ వస్తారో లేదో.. కానీ హరీశ్‌రావు మాత్రం ఇంతకాలం రాకపోవడానికి గౌరవం లేదనే అంశాన్ని పరోక్షంగా సమర్ధించినట్లయింది. ఇకపైన కూడా రావడం అనుమానమే అనే చర్చకు ఆస్కారం ఇచ్చినట్లయింది. ఈ వ్యాఖ్యలు హరీశ్‌రావు వ్యక్తిగతమా?.. లేక ఆయన ద్వారా కేసీఆర్ చెప్పించారా?… లేక పార్టీ నిర్ణయమా?… వీటిపైనే ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. హరీశ్‌రావు ఏ ఉద్దేశంతో, ఏ నేపథ్యంలో ఈ కామెంట్లు చేసినా కేసీఆర్, కేటీఆర్ మెడకు చుట్టుకున్నాయి