BRS MLA: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనాన్ని రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తుతో బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైలు పరిగెట్టాయి. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు నిందితులుగా ఉండటం.. పలువురిని అరెస్టు చేసి పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. ఆ తర్వాత కేసులో కీలక వివరాలు సేకరించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ కేసు గురించి అప్ డేట్స్ తక్కువయ్యాయి. కానీ, నేడు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌ను లేవనెత్తారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అగ్రనాయకులు కేసీఆర్, కేటీఆర్, కవితల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. తన పర్సనల్ విషయాలు కూడా లీక్ అవుతున్నాయని పాడి కౌశిక్ రెడ్డి వివరించారు.
Also Read: CM Chandrababu: సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న అధికారులు
అంతేకాదు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని, అది కూడా సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఎమ్మెల్యే పాడి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపింది. ఈయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందించారు. కౌశిక్ రెడ్డికి శాసన సభ్యుడిగా కనీస జ్ఞానం లేదన్నారు. తాడి చెట్టు లెక్క పెరిగాడు కానీ, బుర్ర పెరగలేదని ఎద్దేవ చేశారు. ఆయన కార్యకర్త, యువ నాయకుడిగా అనుకుంటున్నాడేమోనని సెటైర్వు వేశారు. ఒక నియోజక వర్గానికి శాసన సభ్యుడు అనే విషయం మర్చిపోతే ఎలా అంటూ చురకలంటించారు వెంకట్. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి, తమ నాయకులకు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ మెప్పు పొందడానికి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు, ఫోన్ ట్యాపింగ్‌పై ఉక్కుపాదం మోపిందే సీఎం రేవంత్ రెడ్డి అని, టీవీలలో కనిపించడానికే కౌశిక్ అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన దౌర్భాగ్యం కేసీఆర్, కేటీఆర్‌లదేనని, కటకటాల్లో ఉన్న అధికారులను అడిగితే ఈ విషయం తెలుస్తుందని సెటైర్లు వేశారు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి సోయి తెచ్చుకొని వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు బల్మూరి వెంకట్.