BigTV English

Telangana flood news: ఊరినే ఊడ్చేసిన వరద.. మోరంచపల్లి మొర..

Telangana flood news: ఊరినే ఊడ్చేసిన వరద.. మోరంచపల్లి మొర..
Moranchapalli village flood

Moranchapalli village flood news(Telangana news live):

ఒక్కరాత్రిలో సర్వస్వం కోల్పోయారు. ఆ రాత్రి వాళ్ల జీవితాలకు కాళరాత్రిగా మిగిలింది. కట్టుబట్టలు తప్ప ఇంకేమీ లేకుండా చేసింది. ఎప్పుడూ వచ్చే వరదే కదా అనుకున్నారు. ఈసారి కూడా అలాగే వచ్చి వెళ్తుంది అనుకున్నారు. అలాగే వరద వచ్చింది. అయితే ఈసారి మాత్రం ఊరికే వెళ్లలేదు. ఊరినే ఊడ్చేసుకెళ్లింది. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఇళ్లకు వచ్చిన జనం షాక్‌ గురయ్యారు. ప్రాణాలైతే మిగిలాయి తప్ప ఇంకా అక్కడ చేసేదేముందని భారంగా తిరుగుముఖం పట్టారు. తలదాచుకునేందుకు బంధువుల ఇళ్లకు బయల్దేరారు.


జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఎక్కడ చూసినా శ్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. భారీ వరదలకు ఆ ఊరు ఎంతగా డ్యామేజ్‌ అయిందంటే పూర్తిగా రూపు రేఖలు కోల్పోయింది. దాదాపు 300 ఇళ్లు 700 మంది గ్రామస్తులు ఉన్న ఈ చిన్న ఊరు వరదలకు ఉనికి కోల్పోయింది. గురువారం ఆకస్మిక వరదలు ఇళ్లను పూర్తిగా ముంచేశాయి. అనేక మంది భవనాల పైకి చేరుకొని సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. బిక్కుబిక్కుమంటూ గడిపారు. అక్కడి వారి అవస్థలను మీడియా పెద్దఎత్తున ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ సాయంతో బాధితులను రక్షించేలా ఆదేశాలిచ్చారు. వరదల్లో చిక్కుకున్న గ్రామస్థులను NDRF బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగాయి. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా రెస్క్యూ చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా-పరకాల ప్రధాన రహదారి పై మోరంచపల్లి వాగు ఉంది. ఇది ప్రతీయేడాది వాగు పొంగిపొర్లడం సాధారణమే. ఉధృతి ఎక్కువైతే కొంతమేరకు వరద నీరు ఊరిని ముంచెత్తుతుంది. ఈసారి మాత్రం ఊహించని స్థాయిలో వరద పోటెత్తింది. ఎడతెరిపిలేని భారీ వర్షాలకు ఏకంగా 15 ఫీట్ల ఎత్తున వరద ప్రవహించింది. ఒక్కసారిగా షాక్‌ గురైన మోరంచపల్లి గ్రామస్థులకు ఏం చేయాలో పాల్పోలేదు. ప్రాణాలు అరచేతపట్టుకొని భవనాలపైకి చేరుకున్నారు. ప్లాస్టిక్‌ కవర్లు కప్పుకొని పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొందరు తమ పశువులను కాపాడుకునేందుకు వాటిని బిల్డింగ్‌పైకి తీసుకెళ్లారు. ఊరి నుంచి కాలు కూడా కదిపే పరిస్థితి లేకుండా వరద ముంచెత్తడంతో సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సహాయక బృందాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందేళ్లలో ఈ స్థాయి వరద రాలేదని స్థానికులు చెబుతున్నారు.


రాత్రి గండం గడిచిన తర్వాత ఉదయాన్నే వరద కొంత తగ్గుముఖం పట్టింది. ఇళ్లకు తిరిగి వచ్చిన ప్రజలు పరిస్థితుసు చూసి దిగ్బ్రాంతి చెందారు. ఇళ్లలో మొత్తం బురద పేరుకుపోయింది. వస్తువులు పూర్తిగా పనికి రాకుండా పోయాయి. తినడానికి తిండి గింజలు కూడా మిగలలేదు. విలువైన వస్తువులన్నీ బురద పాలయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయాయి. అవి రిపేర్‌ చేసినా పనికి వస్తాయనే గ్యారెంటీ లేదు. ట్రాక్టర్లు బోల్తా పడిపోయాయి. ఇళ్లలో ఉన్న టూ వీలర్లు బురదలో కూరుకుపోయాయి. ఫర్నీచర్‌ నామరూపాల్లేకుండా పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే అసలు అవి ఇంటి పరిసరాలు అంటే గుర్తుపట్టలేనంగా డ్యామేజ్‌ అయ్యాయి. కట్టుబట్టలు తప్ప ఇంకేమీ మిగలకుండా పోయాయి. రోడ్లైతే నామ రూపాల్లేకుండా కొట్టుకు పోయాయి. ఈ ఊరిని పునరుద్ధరించడం కంటే ఓ కొత్త ఊరిని నిర్మించడం సులువేమో అనేలా వరద భయానక దృశ్యాలను మిగిల్చింది. ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలో తెలియక కొందరు బోరున విలపించడం అందర్నీ కలచివేసింది.

మోరంచపల్లిలో ఏ ఇల్లు చూసినా హృదయాన్ని కలచివేసే పరిస్థితులే ఉన్నాయి. ఎవర్ని కదిలించినా గుండెలు పగిలేలా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. రైతుల గోసైతే వర్ణనాతీతం. ఎక్కడ కట్టేసిన పశువులు అక్కడే ప్రాణాలు కోల్పోయాయి. గ్రామం ఓ శ్మశానాన్ని తలపించేలా మారిపోయింది. ఎక్కడ చూసిన పశు కళేబరాలతో నిండిపోయింది. ఎద్దులు, ఆవులు, గేదెలు వరదలో మునిగి ప్రాణాలు విడిచాయి. వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన పశువులు కోల్పోయిన రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. పంటపొలాల్లో పెద్దఎత్తున ఇసుక మేటలు వేసింది. వేసిన పంటలు పనికి రాకుండా పోయాయి. ఇసుకను తొలగించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలియదు. మళ్లీ తమ పొలాల్లో అసలు సాగు చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యేదేనా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

మోరంచపల్లి ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైపోయింది. నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. ఇప్పట్లో ఆ రోడ్డును పునరుద్ధరించడం కూడా సాధ్యం కాదన్నట్లుగా డ్యామేజ్‌ అయింది. వాహనాల రాకపోకలు సాగించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ భయానక పరిస్థితుల్లో ఎలా ఉండాలో అర్థంగాక కొందరు కట్టుబట్టలతో ఊరు విడిచి వెళ్లిపోయారు. పెట్టెడు దుఃఖంతో తలదాచుకునేందుకు బంధువుల ఇళ్లకు భారంగా బయల్దేరారు. మొరాంచపల్లి సహా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వం హెలికాప్టర్‌ సాయంతో వరద బాధితులకు ఆహారం అందించే ప్రయత్నం చేసింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×