Medchal News: మేడ్చల్, బ్యూరో స్వేచ్ఛ: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం, మున్సిపల్ పరిధిలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి స్పష్టం చేశారు. మూడుచింతలపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశం, పరిచయ వేదిక కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. నూతన పాలకవర్గం, అధికారులు, సిబ్బంది పరస్పరం పరిచయం చేసుకొని పట్టణ అభివృద్ధి దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ జాము రవి మాట్లాడుతూ, మూడుచింతలపల్లిని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
Also Read: Prabhas Fauji: ఆ 20 నిమిషాలే కీలకం.. ప్రభాస్ తో హను మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
పట్టణంలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రహదారుల అభివృద్ధి, వీధి దీపాల నిర్వహణ, చెత్త నిర్వహణ వంటి ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక పాలన అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.మున్సిపల్ పరిధిలో స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చి శుభ్రమైన పట్టణంగా నిలిపే దిశగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపడతామని తెలిపారు. వైస్ చైర్‌పర్సన్ శశిరేఖ మాట్లాడుతూ, ప్రజల సహకారంతో మున్సిపల్ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. కమిషనర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు.ఈ సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.