Bogatha Waterfalls: ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో ఉన్న బొగత జలపాతం.. తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన ప్రముఖ పర్యాటక ప్రదేశం.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉగ్ర రూపం దాల్చింది. జులై 24, 2025 నాటికి, జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.. పైగా ఛత్తీస్గఢ్ ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వెంకటాపురం మండలంలో 30 గంటల్లో 46 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది, ఇది రికార్డు స్థాయిలో ఉంది.
వరద ప్రభావంతో ఐరన్ రెయిలింగ్స్ డ్యామేజ్
ఈ భారీ వరదల కారణంగా, టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ఐరన్ రెయిలింగ్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి.. దీంతో పర్యాటకుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని.. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అధికారులు బొగత జలపాతాన్ని సందర్శకుల కోసం మూసివేశారు. పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, సందర్శకులను నిషేధించారు. దీంతో ఎవరూ వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అల్లకల్లోలం..
ములుగు జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, మంగపేట మండలంలో మల్లూరు అత్తచెరువు లీకేజీతో 30 ఇండ్లు నీటమునిగాయి. రాళ్లవాగు వంతెన తాత్కాలిక రోడ్డు కోతకు గురై, భద్రాచలం-ములుగు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. ఏ క్షణంలో వరద తమ ఇండ్లను ముంచెస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఇళ్లల్లోకి చేరి ఏజెన్సీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళ నిద్ర మాని వరద నీరు ఇళ్లల్లోకి రాకుండా తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి సీతక్క గుండ్ల వాగు, జలగలంచవాగులను పరిశీలించి, అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణలో నిండుకుండలా మారిన ప్రాజెక్టులు..
తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండటంతో.. ఆరు గేట్లు ఎత్తి 30వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్ధ్యం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 71 మీటర్లకు నీటి మట్టం చేరింది.
ఎగువ నుంచి దిగువకు వదులుతున్న నీరు..
ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురం భీమ్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షానికి వరద ఉధృతి పెరిగింది. 381 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. 1039 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. 38 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం 237.30 మీటర్లకు నీటి మట్టం చేరింది.
Also Read: శుభాల మాసం శ్రావణం.. విశిష్టత.. చేయాల్సిన పూజలు ఇవే..!
జాగ్రత్తలు..
అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు. వర్షాలు తగ్గే వరకు ఈ జాగ్రత్తలు కొనసాగించాలని తెలిపారు.